Dunzo: డుంజోకు సహ-వ్యవస్థాపకుడు దల్వీర్‌ సూరీ రాజీనామా

Dunzo: ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న డుంజో భారీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో సూరీ వైదొలగడం గమనార్హం.

Published : 02 Oct 2023 18:44 IST

ముంబయి: రిలయన్స్‌ మద్దతున్న క్విక్‌ కామర్స్‌ సంస్థ డుంజో (Dunzo) సహ- వ్యవస్థాపకుడు దల్వీర్‌ సూరీ కంపెనీ నుంచి వైదొలగారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ సంస్థ భారీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ త్రైమాసికం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

గత కొన్ని నెలలుగా డుంజో (Dunzo) నిధుల సమీకరణ కోసం విఫలయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఉద్యోగులను తొలగించింది. డార్క్‌ స్టోర్లను 50 శాతం తగ్గించింది. కొంత మంది ఉద్యోగుల వేతన చెల్లింపులను వాయిదా వేసింది. మరికొంత మంది జీతాలను తగ్గించింది. ఈ తరుణంలో దల్వీర్‌ సూరీ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలకు సంబంధించి కంపెనీ పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదు.

డుంజో (Dunzo) ప్రారంభమైన ఏడాది తర్వాత 2015లో సూరీ కంపెనీలో చేరారు. బిజినెస్‌-టు-బిజినెస్‌ యూనిట్‌ ‘డుంజో మర్చంట్‌ సర్వీసెస్‌’కు నేతృత్వం వహించారు. ఆయన వచ్చిన తర్వాతే ఈ విభాగం పుంజుకుందని సీఈఓ కబీర్‌ బిశ్వాస్‌ తెలిపారు. అయితే, సూరీ ఎప్పటి వరకు కొనసాగనున్నారో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అలాగే ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు తీసుకోనున్నారో కూడా తెలపలేదు. మరోవైపు 25- 30 మిలియన్‌ డాలర్ల నిధుల కోసం రిలయన్స్ రిటైల్‌తో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో డుంజోలో రిలయన్స్‌ వాటా 25.8 శాతానికి పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని