Stock Market: సెన్సెక్స్‌కు 350pts లాభం.. 18,700 పైకి నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 350.08 పాయింట్ల లాభంతో 63,142.96 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 127.40 పాయింట్లు లాభపడి 18,726.40 దగ్గర ముగిసింది.

Updated : 07 Jun 2023 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్‌ను కొనసాగించాయి. రేపు ఆర్‌బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. మే నెలలో చైనా ఎగుమతులు పడిపోయాయన్న వార్తల నేపథ్యంలో ఆసియా సూచీలు నేడు మిశ్రమంగా ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,917.39 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,196.43- 62,841.95 మధ్య కదలాడింది. చివరకు 350.08 పాయింట్ల లాభంతో 63,142.96 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,665.60 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,738.95- 18,636 మధ్య ట్రేడైంది. చివరకు 127.40 పాయింట్లు లాభపడి 18,726.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు పుంజుకొని 82.54 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

గుజరాత్‌లో 40 మెగావాట్ల హైబ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం కేపీఐ ఎనర్జీకి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ అందింది. దీంతో కంపెనీ షేరు 1.88 శాతం పెరిగి రూ.539.50కు చేరింది.

5జీ మౌలిక వసతుల పరికరాల టెస్టింగ్‌ నిమిత్తం చెన్నైలో హెచ్‌సీఎల్‌ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ షేరు ఈరోజు పెద్ద మార్పేమీ లేకుండా రూ.1,130 దగ్గర నిలిచింది.

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో కలిపి 11.1 శాతం సుజ్లాన్‌ ఎనర్జీ షేర్లు చేతులు మారాయి. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 17.62 శాతం పెరిగి రూ.14.35కు ఎగబాకింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణకు కేబినెట్‌ భారీ ప్యాకేజ్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎంటీఎన్‌ఎల్‌ షేరు విలువ ఈరోజు 10.53 శాతం పెరిగి రూ.22.05 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని