Vehicle Insurance: వాహన ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Vehicle Insurance Renewal: గడువు ముగిసిన వెంటనే వెహికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కచ్చితంగా పునరుద్ధరించుకోవాలి (Vehicle Insurance Renewal). ఆ సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..!

Updated : 21 Sep 2023 11:58 IST

Vehicle Insurance Renewal | ఇంటర్నెట్‌ డెస్క్‌: చట్ట ప్రకారం ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. ఇందులోనూ సమగ్ర (Comprehensive), థర్డ్‌ పార్టీ అనే రెండు రకాలుంటాయి. రోడ్డుపైన వాహనం తిరగాలంటే... కనీసం థర్ట్‌ పార్టీ బీమా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన వెంటనే పాలసీని కచ్చితంగా పునరుద్ధరించుకోవాలి (Vehicle Insurance Renewal). పాలసీని రెన్యువల్‌ చేసే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..!

బేరమాడితే తప్పేం కాదు..

వెహికల్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ (Vehicle Insurance Renewal) చేసుకునే సమయంలో గుడ్డిగా వారు చెప్పిన ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీని కోరుతూనే.. ప్రీమియాన్ని తగ్గించమని కోరే వెసులుబాటు మీకు ఉంటుంది. వాహనం తీసుకొని ఎన్నేళ్లవుతుంది? మార్కెట్‌లో దాని విలువ ఎంత? వాహన కండిషన్‌ను బట్టి ప్రీమియంను నిర్ధారిస్తుంటారు. కాబట్టి వాహనంలో ఏ లోపాలూ లేవని భావిస్తే ప్రీమియంను తగ్గించమని కోరవచ్చు. వారు వెహికల్‌ను సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల మేరకు తగ్గించే అవకాశం ఉంది.

కొత్తదైతే సమగ్ర పాలసీ మేలు..

వాహనం కొత్తదైతే.. సమగ్ర పాలసీ తీసుకోవడం మేలు. దీంట్లో ఓన్‌ డ్యామేజ్‌తో పాటు థర్డ్‌ పార్టీ కూడా కవరవుతుంది. వాహనం మరీ పాతదైతే ‘ఓన్‌ డ్యామేజ్‌’ను తీసుకోకపోయినా ఫరవాలేదని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ప్రీమియంపై కొంత వరకు ఆదా చేసుకునే వీలుంటుంది. ఓన్‌ డ్యామేజ్‌ను వదులుకోవడం అనేది మీరు వాహనం నడిపే తీరు, వాహనం విలువ, మీ ఆర్థిక స్తోమత ఆధారంగా నిర్ణయించుకోవాలి. 

వాట్సాప్‌ చాట్‌లోనే నేరుగా చెల్లింపులు

ముందే పునరుద్ధరించాలి..

గడువు ముగియడానికి ముందే పాలసీని పునరుద్ధరించడం ఉత్తమమని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ప్రీమియంలో కొంత రాయితీ లేదా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని బీమా సంస్థలు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి. అలాగే నో-క్లెయిం-బోనస్‌ కూడా పొందొచ్చు. గడువు ముగిస్తే దీన్ని వదులుకోవాల్సి రావొచ్చు.

యూసేజ్‌ ఆధారిత పాలసీలు..

కొన్ని బీమా సంస్థలు యూసేజ్‌ ఆధారిత పాలసీలను అందిస్తున్నాయి. అంటే మన వాహన వినియోగాన్ని బట్టి పాలసీలను నిర్ధారిస్తారు. డ్రైవింగ్‌ బిహేవియర్‌, మైలేజ్‌, ఇప్పటి వరకు వాహనం ప్రయాణించిన దూరం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పాలసీని అందిస్తారు. ప్రీమియం కూడా అందుకు అనుగుణంగానే మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు తరచుగా వాహనాన్ని బయటకు తీసే అవసరం లేకపోతే.. ఇటువంటి పాలసీలను పరిశీలించొచ్చు. ఫలితంగా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు.

యాడ్‌-ఆన్‌లు..

సాధారణ ఇన్సూరెన్స్‌ పాలసీకి కొన్ని యాడ్‌-ఆన్‌లను జత చేసుకుంటే అది మరింత సమగ్రంగా మారుతుంది. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది. తరచూ వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ ఉంటే మేలు. ఒకవేళ ఇంజిన్‌లోకి నీరు వెళ్లి డ్యామేజ్ అయినా.. ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. అలాగే ‘రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌’ యాడ్‌-ఆన్‌ను తీసుకుంటే.. ప్రయాణం మధ్యలో వాహనం ఎక్కడైనా మొరాయించినప్పుడు ఖర్చు లేకుండా దానిని సర్వీసింగ్‌ సెంటర్‌కు తరలించవచ్చు.

క్రెడిట్‌కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు..!

సరైన బీమా కంపెనీ..

పాలసీ తీసుకునే ముందు బీమా కంపెనీ విశ్వసనీయతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ‘క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో’ అధికంగా ఉన్న కంపెనీల్లో పాలసీ తీసుకోవడం మంచిది. అలాగే వేగంగా.. తక్కువ పేపర్‌ వర్క్‌తో సెటిల్‌ చేసేలా ఉండాలి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందన్న కారణంతో అనామక పాలసీలను ఎంచుకోకూడదు. ఆ బీమా సంస్థ క్లెయిం పరిష్కార చరిత్ర, అందించే సేవలను పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

వివరాల్లో తప్పులుండొద్దు..

బీమా పాలసీ తీసుకునేటప్పుడు వాహనం వివరాలు, యజమాని వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోండి. మీ దృష్టికి వచ్చిన అన్ని తప్పులను తక్షణమే బీమా సంస్థ దృష్టికి తీసుకెళ్లండి. మోసపూరిత క్లెయింలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దు. ఇది శిక్షార్హమైన నేరం.

వాహన బీమా పూర్తి జాగ్రత్తలతో తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే.. కష్టకాలంలో మన జేబుపైనే ఆర్థిక భారం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని