రూల్డ్ పేపర్‌లో చేతిరాతతో రాజీనామా లేఖ.. ఎండీకి పంపిన లిస్టెడ్‌ కంపెనీ సీఎఫ్‌ఓ

Handwritten Resignation Letter: ఇ-మెయిళ్ల కాలంలో కార్పొరేట్‌ రంగంలో ఉన్న ఓ ఉన్నతస్థాయి వ్యక్తి చేతి రాతతో రాజీనామా లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Updated : 22 Dec 2023 15:30 IST

దిల్లీ: సాధారణంగా రాజకీయాల్లో రాజీనామా అనగానే అధికారిక లెటర్‌ హెడ్‌పై రాసిన లేఖ గుర్తుకొస్తుంది. అదే కార్పొరేట్‌ రంగంలో అయితే ఎక్కువగా  మెయిల్‌ ద్వారా పంపుతుంటారు. కానీ, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు.. విద్యార్థులు వాడే రూల్డ్‌ నోట్‌బుక్‌ నుంచి తీసుకున్న పేజీలో రాజీనామా లేఖ రాయడం (Handwritten Resignation Letter) అసలు ఊహించుకుంటామా? కానీ, అదే జరిగింది. ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి గీతలున్న కాగితంలో పెన్నుతో రాసి రాజీనామా లేఖను పంపడం ఇప్పుడు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పెయింట్ల తయారీ కంపెనీ మిత్షీ ఇండియా ‘చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)’ రింకూ పటేల్‌ రాజీనామా చేశారు. పిల్లల నోట్‌బుక్‌ నుంచి తీసుకున్నట్లుగా ఉన్న ఓ పేజీలో పెన్నుతో రాసిన లేఖను ఆయన కంపెనీకి సమర్పించారు. ఇ-మెయిళ్ల కాలంలో ఇలా ఓ గీతల కాగితంలో రాజీనామా లేఖ రాయడం (Handwritten Resignation Letter) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్లే తాను కంపెనీ నుంచి వైదొలుగుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు కంపెనీలో పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఆయన రాజీనామా (Handwritten Resignation Letter) విషయాన్ని ‘బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’కు మిత్షీ ఇండియా తెలియజేసింది. కొత్త సీఎఫ్‌ఓ నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ పదవిలోకి కొత్తవారు రాగానే సమాచారం అందిస్తామని తెలిపింది. రాజీనామా లేఖ స్క్రీన్‌షాట్‌ను బీఎస్‌ఈ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని