Twitter: ట్విటర్‌ బిజినెస్‌ ఖాతాదారులపై మస్క్ బాదుడు!

ట్విటర్‌లో బిజినెస్‌ ఖాతాలు నిర్వహించే వారికి ఇచ్చే గోల్డ్‌ బ్యాడ్జ్‌కు ఇకపై అదనంగా రుసుము వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ బ్యాడ్జ్‌  ఖాతాలకు మాత్రమే ట్విటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును వసూలు చేస్తోంది.

Published : 07 Feb 2023 01:18 IST

కాలిఫోర్నియా: ట్విటర్‌ (Twitter) సీఈవోగా ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తీసుకుంటున్న నిర్ణయాలు యూజర్లకు భారంగా మారుతున్నాయి. ఇప్పటికే ట్విటర్‌ బ్లూ బ్యాడ్జ్‌ (Twitter Blue) వెరిఫికేషన్‌ కోసం నెలకు ఆండ్రాయిడ్ (Android) యూజర్ల నుంచి 8 డాలర్లు, ఐఓఎస్‌ (iOS) యూజర్ల నుంచి 11 డాలర్లు సబ్‌స్క్రిప్షన్‌ రుసుము వసూలు చేస్తున్నారు. తాజాగా బిజినెస్‌ ఖాతాదారులు ట్విటర్‌ గోల్డ్‌(Twitter Gold) కలర్‌ బ్యాడ్జ్‌ కోసం నెలకు వెయ్యి డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించారు. బిజినెస్ ఖాతాలకు అనుబంధంగా నిర్వహించే ఖాతాలకు అదనంగా మరో 50 డాలర్లు నెలవారీ రుసుం చెల్లించాలి. ఈ మేరకు బిజినెస్‌ ఖాతాదారులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ మాట్‌ నవర్రా (Matt Navarra) ట్వీట్ చేశారు. 

గోల్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న బిజినెస్‌ యూజర్ల ట్వీట్‌లు ఎక్కువ మందికి చేరేలా బూస్టింగ్‌ సర్వీస్‌ను అదనంగా అందివ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గోల్డ్‌ కలర్‌ బ్యాడ్జ్‌ పొందిన బిజినెస్ ఖాతాదారులు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోకుంటే వారి ఖాతాకు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కోల్పోతారని ఈ-మెయిల్‌ ద్వారా పంపిన సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ట్విటర్‌ అధికారికంగా స్పందిచలేదు. కేవలం బిజినెస్‌ యూజర్లకు మాత్రమే ఈ విధమైన గోల్డ్‌ కలర్‌ బ్యాడ్జ్‌ సబ్‌స్రిప్షన్‌కు సంబంధించి ఈ-మెయిల్స్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. 

గతేడాది డిసెంబరులో ట్విటర్‌ యూజర్లకు వారి అవసరాల ఆధారంగా లేబుల్స్‌, బ్యాడ్జ్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బిజినెస్ ఖాతాలకు గోల్డ్‌ బ్యాడ్జ్‌, ప్రభుత్వ ఖాతాలకు గ్రే బ్యాడ్జ్‌, వ్యక్తులకు (సెలబిట్రీలు, రాజకీయనాయకులు, సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్షర్లు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారు) బ్లూ బ్యాడ్జ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, ట్విటర్‌ను దివాళా ప్రక్రియను నుంచి రక్షించేందుకు గత మూడు నెలల కాలంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. అలానే, గతంలో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ పూర్తిగా అవినీతిమయమైందని, కొద్ది నెలల్లో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని