logo

సైబర్‌ వల.. చిక్కుకుంటే విలవిల

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ నంబర్ల హ్యకింగ్‌, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశ చూపి దోచుకోవడం, ఓఎల్‌ఎక్స్‌, స్నాప్‌డీల్‌ ద్వారా వల విసిరి డబ్బు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య, మధ్యతరగతి వారి నగదు కాజేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. జిల్లా

Updated : 12 May 2022 06:09 IST

 జిల్లాలో పెరుగుతున్న నేరాలకు అప్రమత్తతే రక్షణ

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ నంబర్ల హ్యకింగ్‌, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశ చూపి దోచుకోవడం, ఓఎల్‌ఎక్స్‌, స్నాప్‌డీల్‌ ద్వారా వల విసిరి డబ్బు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య, మధ్యతరగతి వారి నగదు కాజేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి.

మోసాలు జరుగుతున్నాయిలా..

* నీల్వాయికి చెందిన ఓ బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదన గురించి యాడ్‌ చూసి అందులో ఉన్న కాంటాక్ట్‌ నంబరుకు ఫోన్‌ చేసింది. అతడు బాధితురాలితో మీకు ఒక లింకు పంపిస్తున్నాం.. ఆ లింకు క్లిక్‌ చేస్తే కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ముందు మీరు మీ డబ్బుతో ఆ వస్తువులను కొనుగోలు చేయండి, ఆ తర్వాత కమీషన్‌తో కలిపి మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు అని నమ్మించాడు. మొదట రూ.100తో ఒక వస్తువు ఆర్డర్‌ చేయగా మోసగాడు కమిషన్‌తో కలిపి రూ.150 తిరిగి బాధితురాలికి చెల్లించాడు. కమీషన్‌ రావడంతో నమ్మిన బాధితురాలు రూ.13 వేలతో వస్తువులను ఆర్డర్‌ చేయగా, సైబర్‌ నేరగాడు డబ్బులు తిరిగి చెల్లంచలేదు.

* దండేపల్లికి చెందిన ఓ బాధితుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన దుకాణం నడుపుతున్నాడు. సైబర్‌ నేరగాడు వ్యాపారికి ఫోన్‌ చేసి కొన్ని వస్తువులు ఆర్డర్‌ చేశాడు. డబ్బులు పంపించమని వ్యాపారి కోరగా సైబర్‌ నేరగాడు క్యూఆర్‌ కోడ్‌ పంపించి స్కాన్‌ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు. బాధితుడు స్కాన్‌ చేయగా వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.30 వేలు సైబర్‌ నేరగాడు కాజేశాడు.

* సీసీసీ నస్పూర్‌కు చెందిన ఓ బాధితుడు ఫేస్‌బుక్‌ ద్వారా లోన్‌ పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. యాప్‌లో తన వివరాలన్ని పొందుపరిచి, ప్రాసెసింగ్‌ ఫీజు, టాక్స్‌ పేరిట డబ్బులు చెల్లించాలని సైబర్‌ నేరగాడు కోరగా పలు దఫాలుగా రూ.లక్ష చెల్లించి మోసపోయాడు.

* మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ పే కస్టమర్‌ కేర్‌ కోసం గూగుల్‌లో వెతికాడు. సైబర్‌ నేరగాడు సమస్య పరిష్కారం కోసం ఏనీ డెస్క్‌ అనే అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పగా బాధితుడు అతడు చెప్పిన విధంగా చేశాడు. క్రెడిట్‌ కార్డు వివరాలతో పాటు ఏనీ డెస్క్‌ వివరాలు తెలుసుకున్న నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.30 వేలు మాయం చేశాడు.

1930 టోల్‌ఫ్రీ నంబరు...

సైబర్‌క్రైం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును ఖాతాల నుంచి లాగేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపచేసే విధంగా కేంద్రప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే వెంటనే కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబరు 1930కి ఫోన్‌ చేయాలి.  

వీటిని పాటిస్తే మేలు..

* చరవాణులకు వచ్చిన ఓటీపీ, ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోను అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దు. వైఫైల ద్వారా నగదు లావాదేవీలు జరపకూడదు.

* ఏటీఎం కార్డులకు చెందిన పాస్‌వర్డ్‌లను చరవాణులలో సేవ్‌ చేయవద్దు.

* వ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామనే ఫోన్లు, లింక్‌లకు స్పందించవద్దు.

* బ్యాంకు అధికారులమంటూ ఫోన్‌లు వస్తే ఎలాంటి సమాచారం చెప్పవద్దు.

* డెబిట్‌కార్డు, చరవాణి హ్యాక్‌ అయిందన్న అనుమానం రాగానే వెంటనే అంతర్జాల ఆధారిత కొనుగోళ్లను నిలిపివేయాలి. కాల్‌సెంటర్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేస్తే క్రెడిట్‌కార్డుపై లావాదేవీలు ఆగిపోతాయి.

* బ్యాంకు అధికారులకు విషయాన్ని వివరించి ఏయే ప్రాంతాల్లోని ఖాతాలు లేదా ఈ-వ్యాలెట్‌లకు సొమ్ము పోయిందన్న వివరాలను తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని