logo

ఆపదొచ్చిందా .,యాప్ తో మాయం

విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ (ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ) మరో అడుగు ముందుకేసింది. పది రకాల సేవలు ఒకే దగ్గర లభించేలా ప్రత్యేకంగా ఎన్‌పీడీసీఎల్‌ బిల్‌డెస్క్‌ అనే పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది.

Published : 20 Aug 2022 04:44 IST

పది రకాల సేవలందిస్తున్న టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌

చెన్నూరు, న్యూస్‌టుడే

విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ (ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ) మరో అడుగు ముందుకేసింది. పది రకాల సేవలు ఒకే దగ్గర లభించేలా ప్రత్యేకంగా ఎన్‌పీడీసీఎల్‌ బిల్‌డెస్క్‌ అనే పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు, ఒరిగిన స్తంభాలు, వీధుల్లో ఇళ్లకు తాకే తీగల తొలగింపు, ప్రమాదకరంగా ఉన్న నియంత్రికలు, సరఫరాలో నెలకొన్న అంతరాయాలు.. ఇలా ఒకటేమిటి సమస్య ఏదైనా ఇంటి వద్దే ఉండి చరవాణితో అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. బిల్లుల చెల్లింపులతో పాటు మరో తొమ్మిది రకాల సేవలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వినియోగించుకోవచ్చు.
యాప్‌డౌన్‌లోడ్‌ ఇలా..
చరవాణిలో గూగుల్‌ప్లే స్టోర్స్‌లోకి వెళ్లి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ అని టైప్‌ చేయగానే టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ బిల్‌డెస్క్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తోంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన తరువాత రిపోర్ట్‌అన్‌ ఇన్సిడెంట్‌, కాంప్లెయింట్‌, సెల్ప్‌రీడింగ్‌, పేబిల్స్‌, బిల్స్‌ హిస్టరీ, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ హిస్టరీ, లింక్‌ ఆధార్‌ అండ్‌ మొబైల్‌, టారీఫ్‌ డిటేల్స్‌, ఎనర్జీ టిప్స్‌, సేఫ్టీ టిప్స్‌ అనే పది రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
* రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఈ- మెయిల్‌ ఐడీతో పాటు చరవాణి నంబరును నమోదు చేయాలి. వినియోగదారుడి సర్వీసు నంబరు(బోల్డ్‌ లెటర్స్‌లో ఉన్న సంఖ్యను) నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి. యాప్‌ ద్వారా చేసిన దరఖాస్తులను, ఫిర్యాదులను ఉన్నతాధికారులు సంబంధిత కార్యాలయానికి పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. సమస్య పరిష్కారం అనంతరం వినియోగదారుడి చరవాణికి తిరిగి సమాచారం వస్తుంది.

చిత్రం తీసి పంపొచ్చు..
యాప్‌లోకి వెళ్లక ముందు చరవాణిలో లొకేషన్‌ అనే ఆప్షన్ను ఆన్‌ చేయాలి. ఆ తరువాత రిపోర్ట్‌ ఆన్‌ ఇన్సిడెంట్‌ అనే ఆప్షన్‌ను టచ్‌చేస్తే కెమెరా గుర్తు కనిపిస్తోంది. కెమెరా తెరచుకోగానే మనమున్న లొకేషన్‌ స్మార్ట్‌ఫోన్లోని కెమెరాకు అనుసంధానం అవుతోంది. ఆ తరువాత సమస్య కనిపించేలా ఫొటో తీయాలి. అనంతరం పేరు, చరవాణి సంఖ్య నమోదు చేసి సమస్యను వివరించాలి. చిత్రం తీసి వివరాలు నమోదు చేసిన తరువాత సబ్‌మిట్‌ చేయాలి. ఈ సమాచారం నేరుగా విద్యుత్తు సంస్థ ఏర్పాటు చేసిన సర్వర్‌లోకి వెళ్లిపోతోంది. అందులో జీపీఎస్‌ కోఆర్డినేషన్‌ వ్యవస్థ ఉండటంతో ఏ ప్రాంతం నుంచి చిత్రం పంపామో అధికారులకు తెలిసిపోతుంది. దీంతో వారు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.  


సద్వినియోగం చేసుకోవాలి
- రవికుమార్‌, డిస్కం ఏడీఈ, చెన్నూరు

విద్యుత్తు సంస్థ ప్రవేశపెట్టిన యాప్‌ను వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలపై కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు చేసే అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. వినియోగదారులు యాప్‌ ద్వారా పంపించే ప్రతీ సమస్య, దరఖాస్తులకు తక్షణ పరిష్కారం లభిస్తోంది.


సమస్యలపై ఫిర్యాదు చేయడం ఇలా..
* బిల్లు, లైనులో సమస్య, నియంత్రిక కాలిపోతే, సరఫరాలో హెచ్చుతగ్గులు, లోపాలు తదితర ఏ సమస్య వచ్చినా.. యాప్‌లోని కంప్లెయింట్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో చరవాణి నంబరు, సర్వీస్‌ నంబర్‌, ఈ- మెయిల్‌ అడ్రస్‌ నమోదు చేయాలి. దీంతో పాటు కంప్లెయింట్‌ను నమోదు చేయాలి. సమస్య వివరిస్తూ రాశాకా సబ్‌మిట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే సంక్షిప్త సందేశంతో ద్వారా ఫిర్యాదు సంఖ్యతో పాటు ప్రాంతం వివరాలు చరవాణికి వచ్చేస్తాయి.
* వినియోగదారులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు యాప్‌లో అవకాశం కల్పించారు. చరవాణికి వచ్చిన ఫిర్యాదు సంఖ్యను కంప్లెయింట్‌ ఐడీలో నమోదు చేసి సబ్‌మిట్‌ ఆప్షన్‌ ఉపయోగించాలి. వెంటనే మనం తెలియజేసిన సమస్య ఏ స్థాయిలో ఉందో సంక్షిప్త సందేశం చరవాణికి వస్తోంది.
* చెల్లిస్తున్న బిల్లు వివరాలను తెలుసుకునేందుకు పేబిల్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి సర్వీసు వివరాలు నమోదు చేయగానే చెల్లింపు వివరాలు వస్తాయి. ఆయా ఆప్షన్లలో సమాచారాన్ని నమోదు చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు. చెల్లింపుల వివరాలు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది.
* సమస్యలపై నేరుగా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు 1912, 18004250028 అందుబాటులో ఉన్నాయి.
* చెన్నూరు పట్టణానికి చెందిన కృష్ణమాచారి తన వీధిలో విద్యుత్తు తీగలు కిందికి వేళాడుతూ ప్రమాదకరంగా ఉన్న చిత్రాలను తన చరవాణితో తీసి సంస్థ ఏర్పాటు చేసిన యాప్‌ ద్వారా పంపిస్తున్నారు. విద్యుత్తు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో గతంలో తెలియక ఇబ్బందులెదురయ్యేవని తెలిపారు. ప్రస్తుతం యాప్‌ అందుబాటులోకి రావడంతో చెల్లింపులతో పాటు విద్యుత్తు సమస్యలపై చరవాణి ద్వారా ఇంటి నుంచే ఫిర్యాలు చేసే అవకాశం లభించిందన్నారు. సమయం, వ్యయ, ప్రయాసలు లేకుండా యాప్‌ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు రూపొందించిన దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని