logo

Chilkuri Ramchandra Reddy: రాజకీయ సవ్యసాచి.. ప్రజాసేవలో మేటి

సీఆర్‌ఆర్‌..గా సుపరిచితమైన చిల్కూరి రామచంద్రారెడ్డి(81) ఇక లేరు. నిత్యం ప్రజల సేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రస్థానం పరిపూర్ణమైంది.

Updated : 21 Jul 2023 08:32 IST

ముగిసిన రామచంద్రారెడ్డి ప్రస్థానం
నేడు ఆదిలాబాద్‌లో అంత్యక్రియలు
ఈటీవీ - ఆదిలాబాద్‌

సీఆర్‌ఆర్‌..గా సుపరిచితమైన చిల్కూరి రామచంద్రారెడ్డి(81) ఇక లేరు. నిత్యం ప్రజల సేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రస్థానం పరిపూర్ణమైంది. రెండురోజుల కిందట అనారోగ్యంతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరిన ఆయన గురువారం సాయంత్రం 4.30 గంటలకు బ్రెయిన్‌స్ట్రోక్‌తో తుదిశ్వాస వదిలారు. తలమడుగు మండలం ఖోడద్‌కు చెందిన ఆయనది అయిదు పదుల రాజకీయ జీవితం. బీఎస్సీ అగ్రికల్చర్‌ పట్టభద్రుడు. రాజకీయాల కంటే ముందు ఆదర్శ రైతు. ఒక్కసారి పరిచయమైతే చాలు తరువాత పేరుపెట్టి పలకరించే జ్ఞాపకశక్తి ఆయన సొంతం. పెళ్లి, చావుల విషయంలో రాజకీయాలకతీతంగా పల్లె, పట్టణమనే తేడా లేకుండా వెళ్లి పలకరించే లక్షణం ఉండటం ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఆయనంటే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయ సవ్యసాచి అనే ముద్రపడింది.

సమితి అధ్యక్షుడిగా రికార్డు..

70వ దశకంలోనే ఆదిలాబాద్‌ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా సీఆర్‌ఆర్‌ ఎన్నిక రాజకీయ సమీకరణాలను మార్చేసింది. అప్పట్లో మండల వ్యవస్థ లేదు. ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, తలమడుగు, తాంసి ప్రాంతాలతో కలిసి ఆదిలాబాద్‌ పంచాయతీ సమితి ఉండేది. గ్రామ సర్పంచులు, సభ్యులుగా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నిక జరిగేది. సర్పంచి కానప్పటికీ సీఆర్‌ఆర్‌ను ఆయన బంధువైన చిల్కూరి భోజారెడ్డి(మాజీ ఎమ్మెల్యే వామన్‌రెడ్డి తండ్రి) సమితి కో-ఆప్షన్‌ సభ్యుడిగా నియమించారు. 1970లో ఆదిలాబాద్‌ సమితి అధ్యక్షులుగా ఆయన ఎన్నిక కావడం రికార్డు సృష్టించింది. ఇక అప్పటి నుంచి ఆయన  రాజకీయ ప్రస్థానం నిరాటంకంగా సాగింది. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా 1978, 85లో స్వతంత్రంగా, 1989, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1989 నుంచి 92 వరకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటి పారుదుల, గిడ్డంగులు, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ, ప్రస్తుత రాహుల్‌గాంధీ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలందరితో సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఆదిలాబాద్‌ అనగానే పార్టీలో సీఆర్‌ఆర్‌ పేరు ప్రస్తావనకు వచ్చేది. ఎన్నికలంటే గెలుపోటములను ఒకేలా చూడాలి. గెలిస్తే పొంగిపోకూడదు.. ఓడితే కుంగిపోకూడదు అని తరచూ వివరించేవారు. శ్రేణులకు ఆయనంటే ప్రత్యేక అభిమానం.


వర్షాల కారణంగా...

సీఆర్‌ఆర్‌ అంత్యక్రియలు ఆదిలాబాద్‌లోని తిర్పెల్లిలో ఉదయం 11 గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తొలుత ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అంతిమయాత్ర నిర్వహించి ఆయన స్వస్థలం ఖోడద్‌లో అంత్యక్రియలు చేయాలని అనుకున్నారు. వర్షాలు, రాకపోకలకు ఇబ్బందుల కారణంగా చివరికి తిర్పెల్లి వైకుంఠధామానికి మార్చినట్లు ఆయన మేనల్లుడు ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సంజీవ్‌రెడ్డి ‘ఈనాడు’తో తెలిపారు.


ప్రముఖుల సంతాపం

సీఆర్‌ఆర్‌ మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.   నిజాయతీ, క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారన్నారు. ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోతారన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఆర్‌ఆర్‌ లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.  

నిర్మల్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రాంచంద్రారెడ్డి మృతి వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్థానంలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.


వాట్సాప్‌ స్టేటస్‌లలో నివాళులు..

సీఆర్‌ఆర్‌ మృతి పట్ల కాంగ్రెస్‌, భారాస, భాజపా, సీపీఐ, సీపీఎం సహా అన్ని రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, కులసంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంఘాలు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు నివాళులర్పించారు. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టుకున్నారు.  


రాజకీయ గురువు

లోక భూమారెడ్డి, రాష్ట్ర డెయిరీ మాజీ అధ్యక్షుడు

సీఆర్‌ఆర్‌ నాకు రాజకీయ గురువు. 1978లో ప్రారంభమైన మా స్నేహం నేను భారాసలో చేరిన 2021 వరకు కొనసాగింది. రాజకీయం తప్పితే మరో వ్యాపకంలేని గొప్ప నాయకుడు. గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల మధ్యే ఉన్న నేత. రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు, తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో ఆయనంటే అభిమానం ఉంది. అందుకే ఉమ్మడి జిల్లాలో ఆయనది ప్రత్యేక శైలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని