logo

రాజులకోట.. ఉద్ధండుల బాట

నిర్మల్‌.. రాజులు పాలించిన చారిత్రక ప్రదేశం. చుట్టూ సహ్యాద్రి పర్వతాలు.. తలాపున గోదావరి వరవళ్లు తొక్కుతూ అన్నదాతకు అండగా ఉన్న ప్రాంతం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడి నేతలు జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.

Published : 28 Oct 2023 03:08 IST

నిర్మల్‌, న్యూస్‌టుడే

నిర్మల్‌ కోట

నిర్మల్‌.. రాజులు పాలించిన చారిత్రక ప్రదేశం. చుట్టూ సహ్యాద్రి పర్వతాలు.. తలాపున గోదావరి వరవళ్లు తొక్కుతూ అన్నదాతకు అండగా ఉన్న ప్రాంతం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడి నేతలు జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టారు. 2016 అక్టోబరు 11న నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. అప్పటివరకు నిర్మల్‌, సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌, లక్ష్మణచాంద, మామడ మండలాలు ఉండగా.. మండలాల విభజన జరగడంతో కొత్తగా నిర్మల్‌ అర్బన్‌, సోన్‌, నర్సాపూర్‌(జి) కొత్త మండలాలు ఆవిర్భవించాయి. ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్‌, ఐదు దఫాలు తెలుగుదేశం, ఓ సారి సోషలిస్టు, మరోసారి స్వతంత్ర, ఇంకోసారి ప్రజారాజ్యం, బహుజన సమాజ్‌ పార్టీ, తెరాస(ప్రస్తుత భారాస) అభ్యర్థులు గెలుపొందారు. ఈ సారి జరిగే 17 శాసనసభ పోరులో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. రాజులకోటలో పాగా ఎవరు వేస్తారో వేచి చూడాల్సిందే.

కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసి..

ఈ ప్రాంత నేతలు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, ఒకరు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. పీవీ నర్సింహారావు, జలగం వెంగల్‌రావు మంత్రివర్గంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా పని చేశారు. 1964లో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1983లో తెదేపా నుంచి గెలుపొందిన అయిండ్ల భీంరెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. తర్వాత గెలుపొందిన వేణుగోపాలాచారి రాష్ట్ర సమాచారశాఖ, పర్యాటకశాఖ మంత్రిగా కొనసాగారు. ఈయన 1996లో ఆదిలాబాద్‌ ఎంపీగా విజయం సాధించిన అనంతరం కేంద్రంలో యునైటెడ్‌ ప్రభుత్వ హయాంలో కేంద్ర విద్యుత్తు, వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014లో బహుజన సమాజ్‌ పార్టీ నుంచి గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెరాస ప్రభుత్వంలో చేరారు. ఈయన రెండు పర్యాయాలుగా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. 

కొయ్యబొమ్మలకు నిలయం...

పద్మనాయక వంశానికి చెందిన నిమ్మనాయుడు 1650-1700కాలంలో పాలించారు. మరట్వాడ ప్రాంతంలో నివసించే ‘నగిశి’ కళాకారులను నిర్మల్‌కు రప్పించి వారికి ఉపాధి కల్పించి కళలను ప్రోత్సహించారు. వీరు తయారుచేసిన బొమ్మలు పొరుగు రాజ్యాధిపతులను కూడా ఆకట్టుకునేవి. 

పురాతన ఆలయాలు

నియోజకవర్గంలో కదిలి పాపహరేశ్వరాలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయం, దిలావర్‌పూర్‌ ఎల్లమ్మ ఆలయం, బూరుగుపల్లి శివాలయం, బాబాపూర్‌ రాజరాజేశ్వర ఆలయం, అష్టభుజ వేణుగోపాలస్వామి ఇలా మరెన్నో ఆలయాలు ఉన్నాయి.

నిర్మల్‌ నియోజకవర్గ ఓటర్లు..

పురుషులు:  1,17,563
మహిళలు:  1,29,914  
ఇతరులు:      18
మొత్తం :   2,47,495

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని