logo

ఆసిఫాబాద్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆత్మారాం నాయక్‌

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.

Published : 03 Nov 2023 05:23 IST

రెబ్బెన, న్యూస్‌టుడే : ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. భాజపా తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తమకే టికెట్‌ వస్తుందని ప్రచారం కూడా నిర్వహించారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం అభ్యర్థి ప్రకటనతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఇప్పటికే సిర్పూర్‌ నియోజకవర్గానికి డా.పాల్వాయి హరీశ్‌బాబును ప్రకటించిన విషయం విదితమే.

ఆత్మారాం నాయక్‌ 2014 నుంచి తెరాస ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. శాసనసభ రద్దు అనంతరం ఎన్నికలు అనివార్యం కావడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయనకు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉంది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. ఆయన సతీమణి సంధ్యారాణి భాజపా తరఫున ఖైరిగూడ సర్పంచిగా గెలుపొందారు.

ఒకే తేదీ.. ఇది రెండోసారి!

ఆసిఫాబాద్‌ అభ్యర్థిత్వం ఆత్మారాం నాయక్‌ను రెండుసార్లు వరించింది. గత ఎన్నికల సందర్భంగా.. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా 2018 నవంబరు 2న అధిష్ఠానం ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు నవంబరు 2వ తేదీనే అభ్యర్థిగా ప్రకటన వెలువడం గమనార్హం.

గెలుపునకు కృషి

భాజపా అధిష్ఠానం తనపై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించిందని ఆత్మారాం నాయక్‌ తెలిపారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌, ఎంపీ సోయం బాబురావుకు కృతజ్ఞలు తెలిపారు.


వివరాలు

పేరు : ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌
తండ్రి : చంద్రునాయక్‌
తల్లి : నారిబాయి
భార్య : సంధ్యారాణి (సర్పంచి, ఖైరిగూడ)
కూతుళ్లు : నవ్యశ్రీ నాయక్‌, నందిని నాయక్‌
సోదరుడు : వినాయక్‌
సోదరీమణులు : ఆరుగురు
కులం : ఎస్టీ (లంబాడీ)
విద్యార్హతలు : బీఎస్‌ఈ, బీజడ్‌సీ, ఎంఎస్‌డబ్ల్యూ
వృత్తి : వ్యాపారం, వ్యవసాయం
పార్టీ పదవీ : భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని