logo

వలసల జోరు.. కారు బేజారు!

పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్‌, భాజపా పార్టీలోకి చేరుతున్నారు.

Updated : 18 Apr 2024 05:36 IST

జిల్లాలో మారుతున్న సమీకరణాలు..  

ఈనాడు, ఆసిఫాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్‌, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు కండువాలు మార్చడం నిత్యకృత్యంగా మారుతోంది. పైన మన ప్రభుత్వం లేదని, ఎమ్మెల్యేలతో వివిధ అంశాలతో పొసగక, నామినేటెడ్‌ పదవుల భరోసాతో నేతలు పార్టీ మారుతున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు వంద రోజుల కిందట వరకు నిండుగా ఉన్న భారాస పార్టీ నుంచి అధికంగా నాయకులు ఇతర పార్టీల్లోకి మారడంతో.. ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. ఈ చేరికలు ఏ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు, సోదరుడు ఎంపీపీ మల్లికార్జున్‌లు భారాసను వీడి భాజపాలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే అరిగెలకు ప్రస్తుత భాజపా పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల నుంచే స్థానిక ఎమ్మెల్యే, ఇతర నేతలపై అరిగెల కినుక వహించారనే ప్రచారం ఉంది. తాజాగా ఆయన పార్టీ వీడటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఆయన దారిలోనే రెబ్బెన జడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్‌లో చేరారు. తిర్యాణి మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, పలువురు సర్పంచులు ఇటీవలే భారాసను వీడుతున్నట్లుగా ప్రకటించినా.. అనంతరం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

సవాల్‌గా మారనున్న ఎన్నికలు..

జిల్లాలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భారాసకు పెద్దదిక్కుగా ఉన్నారు. సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే తన అనుచరగణంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం విదితమే. ఇప్పటికే పలు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు భాజపా, కాంగ్రెస్‌ పార్టీల్లో చేరారు. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు భారాస నేతలకు సవాల్‌గా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవ లక్ష్మికి స్థానికంగా మైనార్టీ నేతల మద్దతుతోపాటు, ఆదివాసీ ఓటుబ్యాంకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని భారాస నేతలు చెబుతుండగా.. అరిగెల నాగేశ్వరరావు చేరికతో భాజపా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో బలం పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌లు అన్నీ తామై పార్టీని ముందుకు నడిపిస్తుండగా.. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో నాయకత్వలేమి ఉంది. అరిగెల రాకతో భాజపాకు ముఖ్యంగా రెబ్బెన, వాంకిడి, ఆసిఫాబాద్‌ మండలాల్లో క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఏర్పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే భాజపా, కాంగ్రెస్‌, భారాస పార్టీ అభ్యర్థులు మొదటి విడత ప్రచారాన్ని ముగించారు.

ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరిస్థితి?

కొంత కాలం నుంచి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మారుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆమె పలుమార్లు ఖండించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సక్కును కాదని, టికెట్ కేటాయించగా.. గెలుపొందారని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో భారాస ఆదిలాబాద్‌ అభ్యర్థి ఆత్రం సక్కుకు గెలిపించే బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోవ లక్ష్మికి అప్పజెప్పారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా భారాస అధ్యక్షుడు జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో సమన్వయం చేసుకుంటూ కోవ లక్ష్మి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు