logo

గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

Published : 24 Apr 2024 07:18 IST

వసూలు రూ. 20 కోట్లు.. బాధితులు రెండువేలపైనే..

 పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తొలుత ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఈ వ్యాపారం కొనసాగినట్లు తెలిసినా ఉమ్మడి జిల్లా మొత్తంగా బాధితులు ఉండటం మరింత కలకలం రేపుతోంది. సోమవారం ‘ఈనాడు’లో ‘జిల్లా అధికారి.. మోసానికి సూత్రధారి’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన పాలనాధికారి రాజర్షి షా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో? బాధ్యులు ఎవరో విచారించాలని జిల్లా ఎస్పీకి సూచించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు మంగళవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని కంపెనీ కార్యాలయానికి వెళ్లి విచారించారు. అక్కడ సిబ్బంది ఒక్కరే ఉండటంతో ఎంతమంది సభ్యులు ఉంటారనే సమాచారం మాత్రం తెలుసుకోగలిగారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 2 వేలపైనే డిపాజిటర్లు ఉన్నట్లు తెలిసినా.. ఎంత మేర డబ్బులు వారికి చెల్లించాల్సి ఉందో మాత్రం తన వద్ద సమాచారం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు భావించినా.. దాదాపు రూ.20 కోట్ల మేర డబ్బులు డిపాజిట్‌దారులకు రావాల్సి ఉన్నట్లే. ‘ఈనాడు’ కథనం నేపథ్యంలో ఆ కంపెనీ జిల్లా కేంద్ర కార్యాలయానికి సోమ, మంగళవారాల్లో గతంలో డబ్బులు చెల్లించి బాండ్ల గడువు ముగిసిన వారి తాకిడి పెరిగింది. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న అధికారి ప్రస్తుతం పొరుగు జిల్లాలో పనిచేస్తూ తన కింద ఉన్న ప్రధాన ఏజెంట్లతో సంప్రదింపులు జరపడం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సూచన మేరకు పాత్రధారులుగా ఉన్న ఏజెంట్లు మంగళవారం పట్టణంలోని గాంధీ పార్కులో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు సైతం ధ్రువీకరించాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లతో కలిసి గొలుసుకట్టు వ్యాపారం నిర్వహించిన సదరు అధికారి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించేలా ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.

 100 ఎకరాల కంపెనీ భూమిపై దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా గొలుసుకట్టు వ్యాపారం కొనసాగించిన కంపెనీవారు జిల్లాలవారీగా ఏజెంట్లను నియమించుకుని ఆకర్షణీయ ప్యాకేజీలు, కమీషన్లతో అమాయకుల నుంచి డిపాజిట్లు సేకరించింది. ఇందులో అత్యధికులు టీచర్లు ఏజెంట్లుగా ఉండటం, ఈ విషయం వెలుగులోకి రావడంతో తమ ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందననే భయం వెంటాడుతోంది. కంపెనీ గతంలో హైదరాబాద్‌ నగర శివారులోని బీబీనగర్‌, పింజర్ల గ్రామాల్లో 200 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేసింది. ఇందులో కొంతమేర ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఏజెంట్లకు కంపెనీ కట్టబెట్టిందని, అలా విక్రయించిన డబ్బులను ఏజెంట్లు డిపాజిట్‌దారులకు చెల్లించినట్లు తెలుసుకున్న జిల్లా ఏజెంట్లు తాము అదేమార్గం అనుసరించాలని భావిస్తున్నట్లు రహస్య భేటిలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులతో చర్చించి బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

పోలీసులు ఏమంటున్నారంటే..

ఇది ప్రైవేటు కంపెనీ వ్యవహారం కాబట్టి సూత్రధారిగా ఉన్న అధికారినిగానీ, ఆయన కింద ఉన్న ఏజెంట్లను గానీ నేరుగా విచారించాలంటే బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసువర్గాలు సూచిస్తున్నాయి. ఫిర్యాదు అందితే సదరు అధికారితోపాటు ఏజెంట్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల చుట్టూ ఉచ్చు బిగించే అవకాశముంటుందనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి వినిపిస్తోంది. తమవంతుగా కంపెనీ లావాదేవీలు, నిర్వాహకులు, ఏజెంట్లు ఏం చేశారన్నది ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించినట్లు ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని