logo

నిర్వాసితులకు మళ్లీ నిరాశే

బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులకు మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం నియోజకవర్గంలో జగన్‌ బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో మల్లవల్లి నిర్వాసితుల అంశం

Published : 16 Apr 2024 05:20 IST

హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం గ్రాణం, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులకు మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం నియోజకవర్గంలో జగన్‌ బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో మల్లవల్లి నిర్వాసితుల అంశం ఎన్నికల్లో ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ఎంపిక చేసిన కొద్దిమంది నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేసరపల్లిలో జగన్‌ బస చేసిన ప్రాంతం వద్దకు వినతిపత్రం పట్టుకుని ఎంపీటీసీ సభ్యుడు చాకిరి వెంకటనారాయణ, నిర్వాసితుల సంఘం నాయకుడు పంతం కామరాజు ఆధ్వర్యంలో పది మంది రైతులు వెళ్లారు. బస్సు యాత్రకు బయలుదేరే ముందు వీరి వద్దకు వచ్చిన జగన్‌ వినతిపత్రం తీసుకుని మొక్కుబడిగా కొద్దిసేపు మాట్లాడారు. అయిదేళ్లు వీరి సమస్యలు పట్టించుకోని ఆయన, చూద్దాం చేద్దామన్న సమాధానం సరిపెట్టి వెళ్లిపోయారు.

వినతిపత్రం నిరాకరణ.. మూడ్రోజులుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమగోడు వినిపించి వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసితులకు  నిరాశే ఎదురైంది. విమానాశ్రయ విస్తరణలో భాగంగా దావాజీగూడెంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలులో భాగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్న నగదు ఇప్పించండి మహాప్రభో.. అంటూ అయిదేళ్లుగా నిర్వాసితులంతా మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌, కలెక్టర్‌ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగారు. అయినా సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ముఖ్యమంత్రిని కలిపిస్తామని.. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి మూడ్రోజుల ముందుగానే నిర్వాసితుల సంఘం పెద్దలైన తిరువీధి ఏసురత్నం, కొడాలి సుధాకర్‌, నిమ్మకూరి కోటేశ్వరరావు, తిరువీధి ఏసులకు ఫోన్లు చేయడంతో ఇవాళ ఉదయం క్యాంపు వద్దకు చేరుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు నిర్వాసితులు దగ్గరకు వరకు వెళ్లినప్పటికీ సీఎం పట్టించుకోకపోవడంతో పక్కన అధికారులకు నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని