logo

జనంపై జగనన్న అదనపు బాదుడు

విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రీడింగ్‌ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్‌ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్‌డ్‌, ట్రూఅప్‌, ఇతర ఛార్జీల  పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది.

Published : 24 Apr 2024 04:45 IST

న్యూస్‌టుడే, గుడివాడ(నెహ్రూచౌక్‌), ఘంటసాల, కూచిపూడి

విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రీడింగ్‌ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్‌ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్‌డ్‌, ట్రూఅప్‌, ఇతర ఛార్జీల  పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. దీనికి తోడు కొన్ని బిల్లులు కమర్షియల్‌, డొమెస్టిక్‌ అని ఒకే దాంట్లో చూపిస్తుండడం గమనార్హం. ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి రూ. 51, రూ. 42 చొప్పున ఛార్జీలు వేయడం దారుణం.. ఒక వినియోగదారుడికి 84 యూనిట్లు వినియోగించినందుకు రూ. 1,043, అదనపు ఛార్జీలు కలిపి రూ.1570 బిల్లు రావడం విడ్డూరం. దీన్ని బట్టి ఒక్కో యూనిట్‌ రూ. 18.69 పడింది. ఈ విధంగా వినియోగదారులపై ప్రభుత్వం మోపుతున్న భారం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.


84 యూనిట్లకు రూ. 1570 బిల్లు

- వి.దుర్గాప్రసాద్‌, అపార్టుమెంటు వాసి, గుడివాడ

బిల్లు చూస్తే చదువుకున్న మాకే అర్థం కావడం లేదు. మేము అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటాము. ఒకవైపు కమర్షియల్‌ అంటారు.. మరోవైపు డొమెస్టిక్‌ అని ఉంటుంది. బిల్లు యూనిట్లు 228 అని.. అందులోనే సగటు యూనిట్లుగా 84గా పేర్కొన్నారు. బిల్లు మాత్రం రూ. 1043 అదనపు ఛార్జీలతో కలిపి రూ. 1570 వచ్చింది. ఇలాగైతే బిల్లులు చెల్లించడం చాలా కష్టం. 


సర్‌ఛార్జీలతో అదనపు భారం

- గుత్తికొండ వరప్రసాద్‌, రైతు, చిట్టూర్పు

సర్‌ఛార్జీల పేరుతో అదనపు భారం మోపారు. గతంలో మధ్య తరగతి ప్రజలకు ఏసీకి రూ.1,000 బిల్లు వచ్చేది. నాలుగేళ్లుగా నెలకు రూ.4,000కుపైగా వస్తోంది. వినియోగదారుడు ఏసీ లోడు పెంచుకోవడం తెలియక విద్యుత్తు వాడుతుంటే.. అధికారులు మీటరు ఏసీ లోడు సామర్థ్యం ఎందుకు పెంచుకోలేదని రూ.5,000 నుంచి రూ.10,000 అపరాధ రుసం విధిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్తు వినియోగం పెను భారంగా మారింది.


అప్పు చేయాల్సి వస్తోంది

- కొడాలి రాము, భట్లపెనుమర్రు

ఇంటి వద్దే ఇడ్లీలు, టీ అమ్ముకుంటూ జీవిస్తున్నాం. ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారం కావడంతో గత ప్రభుత్వ హయాంలో కేటగిరి-1లో ఉన్న మీటరుకు బిల్లు చెల్లించలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారం చేస్తున్నామనే సాకుతో కేటగిరి 2లోకి మార్చారు. మార్చిన సమయంలో రూ.1,200 బిల్లు వచ్చింది. పెరిగిన సర్‌ఛార్జీల నేపథ్యంలో ఈ నెల 2,627 వచ్చింది. బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్‌ తొలగించారు. ప్రతి రెండు మూడు నెలలకు ఇదే పరిస్థితి. అప్పులు చేసి బిల్లు కట్టాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని