logo

గుట్టకాయ స్వాహా

కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. ఏవైనా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తొలుత కొండలు, గుట్టల్లో మట్టిని తరలించి, ఆపై చదును చేసి పక్కా ప్రణాళికతో ఆక్రమించుకుంటున్నారు.

Updated : 25 Nov 2022 05:13 IST

చదును చేసి పంటలు వేసి..
వైకాపా నాయకుల కబ్జాపర్వం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పెద్దపప్పూరు, తాడిపత్రి: కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. ఏవైనా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తొలుత కొండలు, గుట్టల్లో మట్టిని తరలించి, ఆపై చదును చేసి పక్కా ప్రణాళికతో ఆక్రమించుకుంటున్నారు. ఏదో ఒక వంక పెట్టేసి సాగులో ఉన్నట్లు చూపి, డి.పట్టాల కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేస్తున్నారు. వైకాపా ముఖ్య నాయకుల అండతోనే ఇదంతా చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. అనంతపురం జిల్లా శింగనమల, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి మండలాల పరిధిలోని గుట్టలన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే 500 ఎకరాల వరకు చదును చేసి పట్టాలకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నివేదికలు రూపొందిస్తున్నారు.

చాగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలోని 412, 413 సర్వే నంబరులో గుట్ట ఉంది. స్థానిక వైకాపా నాయకులు ఇటీవల 130 ఎకరాల వరకు చదును చేశారు. సాగులో ఉన్నట్లు అసైన్‌మెంట్‌ కమిటీలో పెట్టించి పట్టాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చాగల్లు వరద కాలువకు ఆనుకుని ఉండటంతో కొంతకాలం తర్వాత భూమి ధర పెరుగుతుందనే ఉద్దేశంతో వందల ఎకరాలను ఆక్రమించుకుంటున్నారు.

అటవీ భూముల్నీ వదల్లేదు

పెద్దపప్పూరు మండలంలో కొందరు వైకాపా నాయకుల కన్ను రిజర్వు ఫారెస్టు భూములపై పడింది. ముచ్చుకోట గ్రామంలో 413 సర్వే నంబరులో రిజర్వు ఫారెస్టు ఉంది. స్థానిక నాయకులు ఇప్పటికే 137 ఎకరాలు చదును చేశారు. వేల సంఖ్యలో భారీ చెట్లను తొలగించి సొంతం చేసుకునేలా ప్రణాళికలు రచించారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా అటవీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

ఒక్క దెబ్బకు రెండు పనులు

తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల పరిధిలో కొన్ని నెలలుగా గుట్టలను కొల్లగొట్టి మట్టిని తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు పూర్తయిన తర్వాత గోతులను పూడ్చి చదును చేస్తున్నారు. అందులో పండ్ల తోటలు, వివిధ రకాల పంటలు దర్జాగా సాగు చేస్తున్నారు. స్థానిక నాయకులు ఒక్కొక్కరూ 5 నుంచి 10 ఎకరాలను ఆక్రమించారు. ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుని పట్టాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు మట్టి తరలింపుతో ఆదాయం పొందుతూ.. ఇటు విలువైన భూమిని సొంతం చేసుకుంటున్నారు. దొంగ పట్టాలు సృష్టించి ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయించారు. మరికొందరు ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయించి చేతులు మారుస్తున్నారు. ఈ బాగోతంలో రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నట్లు సమాచారం.


శింగనమల మండలం కొరివిపల్లికి చెందిన స్థానిక నాయకుడొకరు గుట్ట మొత్తాన్ని మింగేశారు. సర్వే నంబరు 1లో సుమారు 30 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని చదును చేసి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. గతంలోనే డి.పట్టాలను సృష్టించి కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గుట్టకు ఆనుకుని ఆయనకు పదుల ఎకరాల పట్టా భూమి ఉంది. అలాంటి వారికి డి.పట్టాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం.


పెద్దపప్పూరు మండలంలో పునరావాస గ్రామ మైన తబ్జులలో రెండెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. భవిష్యత్తు అవసరాలకు వదిలిన భూమిని వైకాపా నాయకుడు చదును చేసి పంట వేశారు. పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శ్మశానికి కూడా స్థలం కరవైన గ్రామంలో కబ్జాకు గురైనా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.


తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో సర్వే నంబరు 1390లో గుట్ట ప్రాంతం ఉంది. స్థానిక వైకాపా నాయకులు దాదాపు 100 ఎకరాలు చదును చేశారు. మొత్తం 20 మంది కలిపి ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున డి.పట్టాల కోసం తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై గ్రామ సర్పంచి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

* పుట్లూరు మండలం చింతకుంటలోని సర్వే నంబరు 1లో 127 ఎకరాల ప్రభుత్వ భూమిపై వైకాపా నాయకుల కన్నుపడింది. డి.పట్టాల కోసం పెద్దఎత్తున జేసీబీలో చదును చేస్తున్నారు. సాగులో ఉన్నట్లు బినామీల పేర్లతో దరఖాస్తులు చేస్తున్నారు. అరకటవేములలో సర్వే నంబరు 1లోని 65 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నాయకులు చదును చేశారు.


విచారణ జరుపుతున్నాం

- మధుసూదన్‌, ఆర్డీవో, అనంతపురం

డివిజన్‌ పరిధిలో గుట్టలు, కొండల ఆక్రమణలపై విచారణ జరుపుతున్నాం. అనంతపురం, రాప్తాడు ప్రాంతాల్లో గుట్టలను చదును చేస్తున్న పొక్లెయిన్‌లను సీజ్‌ చేశాం. పుట్లూరు పరిధిలో గుట్టల చదునుపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించాం. కొత్తగా చదును చేస్తున్నవారికి పట్టాలు ఇచ్చేదిలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనతోపాటు సాంకేతికతను ఉపయోగించి ఐదేళ్ల డేటా తీసుకుంటున్నాం. దీంతో అక్రమాలకు తావు ఉండదు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts