logo

ఫైబర్‌ నెట్‌కు ఆదరణేదీ?

పలమనేరు పట్టణంలో మొత్తం 12 వేల కుటుంబాలు ఉంటే.. అన్ని కుటుంబాలకూ ఈ నెట్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. అయితే కేవలం వందల్లోనే ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర కంపెనీల నెట్‌ కనెక్షన్లతో బిల్లులు చెల్లిస్తున్నారు.

Published : 09 Mar 2023 05:51 IST

గ్రామీణ ప్రజలకు సక్రమంగా అందని సేవలు
ఏ మాత్రం పెరగని సర్వీసులు

పలమనేరు పట్టణంలో మొత్తం 12 వేల కుటుంబాలు ఉంటే.. అన్ని కుటుంబాలకూ ఈ నెట్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. అయితే కేవలం వందల్లోనే ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర కంపెనీల నెట్‌ కనెక్షన్లతో బిల్లులు చెల్లిస్తున్నారు.

పలమనేరు, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల కోసం, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. చాలా వరకు కనెక్షన్లు పొందిన ప్రజలు నెట్‌ సేవలను అందుకుంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ ఆదరణ మాత్రం ఈ పథకానికి అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన సర్వీసులను ఏమాత్రం పెంచలేదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినవే ఉన్నాయి. కొత్తగా పెరగకపోవడానికి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని స్పష్టమవుతోంది.

అందని సహకారం

జిల్లాలో ప్రస్తుతం కేవలం 25 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 114 మంది ఆపరేటర్లు జిల్లా వ్యాప్తంగా ఏపీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లను నిర్వహిస్తుంటారు. అయితే ఆపరేటర్లు సర్వీసులు పెంచే విషయంలో సహకరించడం లేదని అధికారులు అసంతృప్తిలో ఉన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. ఏపీ ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ కావాలనుకునే వారికి కొత్త పరికరాలు ఇవ్వడం లేదు. ఎవరైనా పాత కనెక్షన్‌ వద్దనుకుని తిరిగి ఇచ్చేస్తే దాన్ని కొత్తగా కావాలనుకునే వారికి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక ఇంటికి అవసరమైన నెట్‌ సర్వీసు, టీవీ ఛానల్స్‌ చూడటానికి కేవలం రూ.190 చెల్లిస్తే సరిపోతుంది. ఇంత చౌకగా మరే ప్రైవేటు నెట్‌ కనెక్షన్‌ లభించదు. అయినా ఇక్కడ ఏపీ ఫైబర్‌ వెనుకబడి ఉంది. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీల వారు నెట్‌ కనెక్షన్లు పెద్ద మొత్తాలకు ఇస్తున్నారు.

పలమనేరులో 132 విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద ఆరుబయటున్న పరికరాలు

ప్రత్యేక కార్యాలయం లేదు

ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయాన్ని పలమనేరులో 132 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఒక మూలన ఏర్పాటు చేశారు. అక్కడ దానికి సంబంధించిన సిబ్బంది ఎవరూ ఉండరు. ముఖ్యమైన ఒక పరికరం మాత్రం దర్శనమిస్తుంది. మిగిలిన పరికరాలు ఒక గదిలో పెట్టెల్లో మూలన కనిపిస్తాయి. కొన్ని ఆరుబయట పడి ఉంటాయి. ప్రజలు తమకు కనెక్షన్‌ కావాలని కార్యాలయానికి వెళ్లి అక్కడ సమాధానం చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ నెట్‌వర్క్‌ను నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు లేకపోలేదు.


నిత్యం అందుబాటులో ఉంటాం
- సుకుమార్‌, మార్కెటింగ్‌ మేనేజరు, ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌, చిత్తూరు

కనెక్షన్‌ కావాలనుకునే వారికి వెంటనే కొత్త పరికరం ఇస్తాం. సర్వీసు కూడా వేగంగా చేస్తాం. ఆపరేటర్ల విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎవరైనా వినియోగదారుని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొత్త వారిని ఆహ్వానిస్తాం. ఏపీఫైబర్‌ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని