logo

సమగ్ర శిక్షే

విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు..

Updated : 18 Apr 2024 05:26 IST

సమ్మె చేసినా ఉద్యోగ భద్రత కరవు
ఎంటీఎస్‌ విస్మరించిన జగన్‌
గాల్లో దీపంలా ఉద్యోగుల భవిత
ఉద్యోగ భద్రత

న్యూస్‌టుడే, చిత్తూరు విద్య: విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. ఒప్పంద పద్ధతిలో పనిచేసే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని చెప్పిన జగన్‌.. అమలు చేసే సమయంలో ఆచరణ సాధ్యం కాని షరతులతో అరచేతిలో వైకుంఠం చూపారు.. సమగ్ర శిక్షలో ఒప్పంద, పొరుగు సేవల కింద ప్రాజెక్టు ఏర్పాటు నుంచి పనిచేసే ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టారు.. ఆ సంఘాల నాయకులను విద్యామంత్రి బొత్స సత్యనారాయణ పిలిచి చర్చలు జరిపారు.. శాశ్వత ఉద్యోగుల గుర్తింపు కన్నా ముందుగా ఎంటీఎస్‌(మినిమమ్‌ టైం స్కేల్‌) పద్ధతిలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం సాగదీసే సరికి సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి.. ఫలితంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ ఉద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయి.

అభద్రతలో 635 మంది ఉద్యోగులు..

సమగ్రశిక్షలో జిల్లా పరిధిలో 635మంది పొరుగు, ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి  ఉద్యోగం చేస్తున్నా అభద్రతకు లోను కావాల్సిందే. ఏటా ఏప్రిల్‌ చివరిలోగానీ.. మే మొదటి వారంలో గానీ.. వారిని ఉద్యోగం నుంచి ఇంటికి పంపుతారు. వారం రోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరినట్లు రికార్డుల్లో నమోదు చేస్తారు. అయితే ఆ వారం రోజులు.. ఆ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నా ఆ రోజులకు జీతం వర్తించదు. దీంతో ఏటా వారం రోజులు వారు ఉచితంగా ఉద్యోగ సేవలు అందిస్తున్నారు. సేవలు వినియోగించుకుంటున్నారే తప్ప వారి గురించి ఆలోచించిన నాథుడే లేడు. ఫలితంగా వారి బాధలు చెప్పనలవికావు.

అటకెక్కిన మంత్రి హామీ..

శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని సమగ్రశిక్ష పరిధిలో పనిచేసే పొరుగు, ఒప్పంద ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల సమ్మె చేశారు. అప్పుడు విద్యామంత్రి బొత్సా సత్యనారాయణ సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. ఉద్యోగులందరికీ ఎంటీఎస్‌ వర్తింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. రోజులు గడిచిపోతున్నా ఎంటీఎస్‌ వర్తింపజేయ డంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేసింది. ఇక ఇది ఎప్పటికి అమలయ్యేనో అని సర్వత్రా ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.

ఎంటీఎస్‌ అమలు చేయాల్సిందే..

గత 15ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ చేస్తామన్నారు. ఇప్పటికీఅమలు కాలేదు. గతేడాది డిసెంబరులో 22 రోజులు సమ్మె చేశాం. అప్పుడు ఎంటీఎస్‌ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. త్వరలో ఎన్నికల అనంతరం రానున్న నూతన ప్రభుత్వం సమగ్రశిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాం.

విల్వనాథం, జిల్లా కన్వీనర్‌, సీఆర్పీ సంఘం

మా తలరాత మారలేదు..

ప్రభుత్వాలు మారుతున్నా సమగ్రశిక్ష లోని పొరుగు, ఒప్పంద ఉద్యోగుల తలరాత మారడం లేదు. శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తునే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా మారాయి. గతంలో జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయలేదు. సమ్మె చేసినప్పుడు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆ కమిటీ ఏమైందో ఇప్పటికీ తెలియలేదు. ఇక హామీల అమలు దేవుడెరుగు.

దేవరాజులు, అధ్యక్షుడు, ఎమ్మార్సీ మెసెంజర్‌ సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని