logo

జడ్పీలో లేకున్నా అతనే కీలకం

ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్‌లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది.

Published : 18 Apr 2024 02:36 IST

300 కీలక దస్త్రాలు దాచిన పూర్వ సీసీ

ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్‌లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం నుంచి జడ్పీలో ఓ కీలక ప్రజాప్రతినిధికి అనధికార సీసీ (పూర్వ అధికారి అనుచరుడు)గా పనిచేసిన వ్యక్తి వద్ద ఇవన్నీ వెలుగుచూశాయి.

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: జడ్పీ నూతన సమావేశ మందిర నిర్మాణ కేసుకు సంబంధించి ఇటీవల దస్త్రాలు కనిపించక జేసీ వాయిదా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జడ్పీ అధికారులు.. సదరు గుమస్తాకు షోకాజ్‌ ఇవ్వడంతో మరుసటి రోజే దస్త్రాలు జడ్పీకి చేరాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. సదరు సీసీ మళ్లీ ఇటీవల జీడీనెల్లూరుకు వెళ్లిపోయినా అతడి బీరువాలో ఇప్పటికి 300 దస్త్రాలు బయటపడటంతో ఉన్నతాధికారులు విస్తుపోయారు. సదరు ఉద్యోగి మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆపై మరోసారి అధికారులు షోకాజ్‌ ఇచ్చేందుకు సన్నద్ధమైన సమాచారం తెలిసి హడావుడిగా వచ్చి కార్యాలయంలోని బీరువాలో ఉన్న దస్త్రాలన్నీ అప్పగించాడు.

పని అక్కడ.. ఇక్కడి తాళాలెందుకు?

జీడీనెల్లూరులో పనిచేస్తున్న ఈ వ్యక్తి వద్ద జడ్పీ కార్యాలయ బీరువా తాళాలు ఎందుకున్నాయి? ఎవరి అనుమతితో ఇలా బరితెగించాడు. దస్త్రాలు రహస్యంగా దాచాల్సిన అవసరం ఏమిటి.. ఇంకెన్ని అతడి ఆధీనంలో ఉన్నాయని అనుమానిస్తున్నారు. వెలుగుచూసిన వాటిలో చాలామంది ఎస్‌ఆర్‌లు.. ఇతరత్రా ఉన్నాయని సమాచారం. పూర్వ అధికారి అండతో ఒకప్పుడు పేట్రేగిపోయిన ఇతను ఇలా దస్త్రాలు దాచడం జడ్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బావురుమంటున్న బాధితులు

ఇతడి నిర్వాకంతో గతంలో కొన్ని విభాగాల దస్త్రాలు కనిపించక క్రమశిక్షణ చర్యలకు గురయ్యామని పలువురు ఉద్యోగులు ప్రస్తుతం తాజా ఘటనతో వాపోతున్నారు. సదరు ఉద్యోగి వద్ద ఇన్ని దస్త్రాలు దాచేందుకు సహకరించిన అధికారులు ఎవరనే దిశగా ఉన్నతాధికారులు అంతర్గత విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం.

8 అన్నీ తానై..

జడ్పీలో ఏం జరగాలన్నా, ఏ ఫైల్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా అతడికి తెలియాల్సిందే. కాదంటే ఎంతటివారైనా సరే బదిలీపై వెళ్లాలి లేదా సస్పెండ్‌ కావాల్సిందే. కీలక దస్త్రాలయితే అతడి వద్దనే ఉండాలి తప్ప విభాగాల వద్ద కూడా ఉండే పరిస్థితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని