logo

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..

కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె.

Updated : 18 Apr 2024 09:09 IST

సివిల్స్‌ విజేతల అంతరంగం

శ్యామలాసెంటర్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సాధన ప్రారంభించారు. మూడుసార్లు విఫలమై నాలుగోసారి లక్ష్యం చేరుకున్నారు రాజమహేంద్రవరానికి చెందిన అడుసుమిల్లి మౌనిక. అఖిలభారత స్థాయిలో 487వ ర్యాంకు సాధించిన ఆమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా అనుభవాలు వివరించారు.

ఇంజినీరింగ్‌ చదువుతుండగానే కొలువు..

మౌనిక స్వస్థలం విజయవాడ అయినా.. రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తండ్రి ఎ.వెంకటప్రేమ్‌చంద్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తుండగా తల్లి సునీత గృహిణి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు విజయవాడలో చదివి బిట్స్‌ పిలానీ (హైదరాబాద్‌)లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (2014-18) నాలుగో ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్‌ (బెంగళూరు)లో కొలువు సాధించారు. వారాంతపు సెలవు దినాల్లో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం.. ఉద్యోగం చేస్తూనే ఏడాది శిక్షణతో సివిల్స్‌ రాశారు.

తొలి ప్రయత్నాలు విఫలమైనా..

మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోలేదు. సొంతంగా సాధన చేస్తూనే ఆన్‌లైన్‌లో నమూనా పరీక్షలు రాయడం, గతంలో దొర్లిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, ఒక ప్రశ్నకు జవాబు కొత్తదనంగా సమగ్ర సమాచారాన్ని జోడించి ఏవిధంగా రాయాలో నేర్చుకొని నాలుగోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. 20 నిమిషాల ఇంటర్వ్యూ స£మయంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నానని, లక్షలు వచ్చే కొలువును వదిలి సివిల్‌ సర్వీసెస్‌కు ఎందుకు వచ్చావని, ఏపీ విభజనతో వచ్చే లాభనష్టాలు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మౌనిక పేర్కొన్నారు. ఇకపై ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.


నాన్న కలే.. నా సంకల్పమైంది..

జగ్గంపేట, న్యూస్‌టుడే: సివిల్స్‌లో ర్యాంకే లక్ష్యంగా మొదటిసారి పరీక్ష రాస్తే ఆశించిన ఫలితం రాలేదు.. రెండోసారి ప్రయత్నిస్తే 314 ర్యాంకుతో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసులో ఉద్యోగం సాధించారు. మరోసారి ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసు ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరంలో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుకి ఎంపికయ్యారు. తాజా ఫలితాల్లో 162వ ర్యాంకు సాధించిన జీను జశ్వంత్‌ ‘న్యూస్‌టుడే’తో తన అనుభూతులను పంచుకున్నారిలా.. జగ్గంపేటకు చెందిన ఆయన మూడేళ్లు బెంగళూర్‌లో శాంసంగ్‌లో ఉద్యోగం చేస్తూ 2020 నుంచి ప్రయత్నాలు చేస్తూ లక్ష్యం  సాధించారు.

తండ్రి లక్ష్యమే అతని ముందున్న గురి..

రెండు సార్లు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించినా సంతృప్తి లేదు. సివిల్‌ సర్వెంట్‌ కావాలనే తండ్రి జీను మాణిక్యాలరావు లక్ష్యాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగా. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 162 ర్యాంకుతో మెరిసి తండ్రి చిరకాల కలను నెరవేర్చాడు జగ్గంపేటకు చెందిన జీను శ్రీ జశ్వంత్‌ చంద్ర. ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆ తండ్రి లేడు. 2021లో అనారోగ్యంతో మరణించారు.

బాల్యమంతా కాకినాడలోనే

జీను జశ్వంత్‌ బాల్యం కాకినాడలోనే సాగింది. తల్లి జీను నాగలక్ష్మి కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.  తాతయ్య విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గొల్లపల్లి లక్ష్మణరావు. జస్వంత్‌ కాకినాడ ఆశ్రమ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్సు చేసి 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని