logo

హామీల గారడి.. కోనసీమకు బురిడీ

ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి.

Updated : 18 Apr 2024 10:49 IST

కోత నివారణ ఊసే లేదు.. ముంపు సమస్యలూ తీరలేదు..
కోనసీమను మోసపుచ్చేందుకు నేడు సీఎం జగన్‌ ‘సిద్ధం’

ఈనాడు, కాకినాడ:ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. ఉద్ధరించడానికి మేమంతా సిద్ధం అంటున్న వైకాపా నేతలపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. నేడు సీఎం జగన్‌ రోడ్‌షో నిర్వహిస్తున్నారు. హామీలను గోదాట్లో కలిపేసి మళ్లీ వస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


అంతన్నారు.. ఇంతన్నారు..

  • ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందించండి. నవంబర్‌లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిద్దాం. కరకట్టల ఆధునికీకరణపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అన్ని లంక గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మిస్తే విపత్తుల సమయంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడతాయి.

- 2022 జులై 26న కోనసీమ వరదలపై రాజమహేంద్రవరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ మాటలివి. నేటివరకు కరకట్టల ఆధునికీకరణ, లంక గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణం ఊసేలేదు.


మాటిచ్చినా.. పనులు జరగలేదు..

  • పి.గన్నవరం మండలం బూరుగులంకలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తుండగా రోడ్లు బాగాలేవని గ్రామస్థులు వెనుక నుంచి కేకలు వేశారు. దీనిపై స్పందించిన సీఎం రోడ్లు చూశాను.. అంచనాలను తయారుచేయించి.. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బూరుగులంక వద్ద నదీకోత నివారణకు నిధులు మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు.

- 2022 జులై 26న పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చోటుచేసుకున్న సంఘటన ఇది. సాక్షాత్తూ సీఎం హామీ ఇచ్చినా లంక గ్రామాల్లో రోడ్లు బాగుపడలేదు. నదీకోత నివారణకు నిధులూ ఇవ్వలేదు.


ఇసుక తవ్వేసి.. చెరువులుగా మార్చేసి..

అంతర్వేదిలో అనధికారికంగా తవ్విన ఆక్వా చెరువు

హామీ: పంట చెరువులను చేపల చెరువులుగా మార్చడాన్ని అరికడతాం.
అమలు తీరు: నియంత్రణ మాటెలా ఉన్నా వైకాపా వచ్చాక మరింత పెరిగింది. అంతర్వేది నుంచి కరవాక వరకు 30 కి.మీ తీరం ఉంది. ఒకప్పుడు 15 అడుగుల ఎత్తులో ఉండే ఇసుక తిన్నెలు ఇప్పుడు మాయమయ్యాయి. వాటిని రొయ్యల చెరువులుగా మార్చేశారు. అతిక్రమణలు నిజమేనని ఎన్జీటీ ఆక్షేపించినా చక్కదిద్దలేదు. తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు,  ఆక్వా చెరువుల నిర్మాణంతో పర్యావరణానికి హాని, పరిహారం వసూలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని 2021లో  (ఎన్జీటీ) ఆదేశించించినా మొక్కుబడి చర్యలే తప్ప కట్టడిలేదు.


కొబ్బరి రైతులకు ఏం చేశారు...?

కోనసీమ జిల్లా నుంచి వెళ్లి తమిళనాడులో పనిచేస్తున్న కార్మికులు (పాత చిత్రం)

హామీ: కొబ్బరి రైతులను ఆదుకుంటాం. అంబాజీపేట మార్కెట్‌ను కళకళలాడేలా చేస్తాం. శీతల గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కష్టాలు లేకుండా చేస్తాం.

అమలు తీరు:  డా.బీఆర్‌ అండేడ్కర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.26లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు ఉంది. దిగుబడి హెక్టారుకు 14,670 కాయలు ఉంటాయి.  3 లక్షల మంది రైతులు, లక్షమందికి పైగా కార్మికులు కొబ్బరి పైనే ఆధారపడి జీవిస్తున్నారు.. కొబ్బరి పంటలోని ఆకులు, కాండం, డొక్కలతో వివిధ ఉత్పత్తులు తయారీ వీలున్నా ఆ దిశగా ప్రోత్సాహం లేదు. కొబ్బరి నీరు, పాలు, నూనెతో ఉప ఉత్పత్తుల తయారీకి ఆస్కారం ఉన్నా ఎటువంటి చొరవ చూపలేదు. రైతులను ఆదుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహించలేదు.

  • ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు వేల ఎకరాల్లో తమలపాకు సాగవుతోంది. విపత్తుల సమయంలో నష్టపోతున్నారు. సరైన మార్కెట్‌ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. రైతులను ఆదుకుంటామన్న హామీని గాలికొదిలేశారు. శీతల గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఊసేలేదు.

ఎత్తిపోతలా.. ఉత్తిపోతలా..?

అమలు తీరు: ప్రాథమిక సర్వే చేసి, ప్రతిపాదనలు సిద్ధంచేసినా పనులు  పట్టాలెక్కలేదు. ఈ పథకం పూర్తయితే మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి, పెదపట్నం, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలతోపాటు.. పి.గన్నవరం మండలం మానేపల్లిలంక గ్రామాల పరిధిలోని 4,200 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. లంక గ్రామాల్లో 60 శాతం బోర్లలో ఉప్పునీరే వస్తోంది. తీరంలో ఉప్పునీటి సమస్యపై తెదేపా హయాంలో చెన్నైకి చెందిన సంస్థతో అధ్యయనం చేయించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ అధ్యయన ఫలితాల విశ్లేషణ లేదు. ఇప్పటికీ ఉప్పునీరే శరణ్యం. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టినా అదీ పూర్తి చేయలేదు. వాటర్‌గ్రిడ్‌ పథకం సైతం పట్టాలు ఎక్కలేదు.
హామీ: అప్పనపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. రైతులకు సాగుపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాం. లంక గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.


విపత్తుల్లో అంతేనా

ఏటా జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు, విపత్తులు కోనసీమ జిల్లాను వెంటాడుతున్నాయి. లంకలు రోజుల తరబడి జలదిగ్భంధంలో ఉండిపోతాయి. ఆరుగాలాల పంట నీట మునగడం రివాజవుతోంది. నిబంధనలకు లోబడి మొక్కుబడిగా అందిస్తున్న వైకాపా సర్కారు సాయం రైతులకు ఊరటనివ్వడంలేదు. దీంతో సాగులో ఉన్న అధికశాతం కౌలు రైతులు నష్టపోతున్నారు. వందల ఎకరాలు నదీకోతకు గురవుతున్నా.. వేల ఎకరాలు నీట మునుగుతున్నా పంట, మురుగునీటి కాలువల వ్యవస్థను చక్కదిద్దే చొరవ చూపడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి రూ.వందల కోట్ల విలువైన హామీలు సీఎం జగన్‌ ఇచ్చినా నెరవేరలేదు. మళ్లీ అవే హామీలతో జనం ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి వైకాపా నాయకులు సిద్ధమయ్యారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని