logo

చెప్పారంటే.. చేయరంతే!

ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు  ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు,

Published : 18 Apr 2024 06:46 IST

మాటలు చెప్పే ముఖ్యమంత్రీ.. చేతలు ఏవీ..?
నేడు సిద్ధం రోడ్‌ షో
హామీలపై ప్రశ్నిస్తున్న జిల్లా వాసులు


ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు  ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే
‘మాట తప్పను.. మడమ తిప్పను..’ ఆ కబుర్లు ఈసారి వినం.. ‘మళ్లీ నిన్ను నమ్మం జగనన్నా’ అంటున్నారు జనం.

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కొవ్వూరు, నిడదవోలు, తాళ్లపూడి, కోరుకొండ


వైకాపా అధికారం చేపట్టిన అయిదేళ్లలో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మేలు చేసే ఒక్క అభివృద్ధి పనీ సక్రమంగా జరగలేదు. స్వయానా ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇచ్చిన హామీలు సైతం నేటికీ పట్టాలెక్కలేదంటే.. నిన్ను ఎలా నమ్మాలి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయిదేళ్ల పాలనలో కొవ్వూరు, నిడదవోలు, బిక్కవోలు, గోకవరం తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల సందర్భంగా ఓట్లు అడగడానికి నేడు వస్తున్నారే.. కోరుకొండ భూముల నుంచి కొవ్వాడ కాలువ వరకు అప్పట్లో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా అని జనం ప్రశ్నిస్తున్నారు.


నిడదవోలుకు  నిధులు నిల్‌

రాష్ట్రవ్యాప్త కాపునేస్తం కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిడదవోలు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు స్థానిక సమస్యలను సీఎంకు వివరించారు. అన్నింటినీ పరిష్కరిస్తానని, నిధులు మంజూరు చేస్తానని ఆ సభా వేదిక మీదే సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు.


మమ్మల్ని అడగొద్దు

నిడదవోలు ఆర్టీసీ బస్టాండ్‌

సుమారు 50 గ్రామాల ప్రజలకు నిడదవోలు ఆర్టీసీ డిపో బస్సులే కీలకం. ఇక్కడ నుంచి రోజూ 12 వేల కి.మీ. మేర బస్సు సర్వీసులు ఉండగా.. సగటున రోజుకు 12 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీని అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు చేస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించినా ప్రతిపాదనల దశ కూడా దాటలేదు. దీనిపై అధికారుల వద్ద ప్రస్తావిస్తుంటే ఆ విషయం మమ్మల్ని అడగొద్దు మహాప్రభో.. అని సమాధానం చెబుతున్నారు. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. వర్షం పడితే ఇబ్బందులు తప్పట్లేదు.


లక్ష్మీనరసింహుని సాక్షిగా   అబద్ధం..

కోరుకొండ శివారున దేవస్థానం ఇనాం భూములు

కోరుకొండ దేవస్థానంలో 72 మంది నౌకరీలకు పూర్వం ఇనాం చట్టం కింద భూములు ఇచ్చారు. కాలక్రమేణా అవి చేతులు మారుతూ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 2013లో భూముల పరిరక్షణలో ఇనాం సర్వీసు రద్దు చేశారు. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. అవసరానికి విక్రయించాలన్నా, తనఖాపెట్టాలన్నా కుదరకపోవడంతో రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అధికారంలోకి రాగానే భూముల సమస్యను పరిష్కరిస్తామని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా హామీ ఇచ్చారు. దీనిపై బాధితులు మండిపడుతున్నారు.


చెల్లెమ్మ అడిగింది..  చేసేస్తున్నా..

విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ కొవ్వూరు వచ్చారు. నియోజక వర్గంలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న పలు సమస్యలను హోంమంత్రి తానేటి వనిత సీఎంకు వివరించారు. ‘మా చెల్లెమ్మ స్థానిక సమస్యలు గురించి చెప్పింది.. అన్నింటికీ ఇక్కడి నుంచే నిధులు మంజూరు చేస్తున్నా..’ అంటూ సీఎం ప్రకటించారు. దాదాపు ఏడాది కావస్తున్నా నేటికీ ఆ పనుల జాడ లేకపోవడంతో ముఖ్యమంత్రివన్నీ ఉత్తుత్తి హామీలేనా.. ఇదేనా ‘మాట తప్పను.. మడమతిప్పను’ అని ప్రశ్నిస్తున్నారు.


కొవ్వాడ కడగండ్లు పట్టవా..

వరదనీటిలో ధాన్యాన్ని తరలించేందుకు అవస్థ(పాత చిత్రం)

ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట నుంచి తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, నిడదవోలు మండలాలు మీదుగా సుమారు 60 కి.మీ మేర కొవ్వాడ కాలువ ప్రవహిస్తోంది. దీనికి సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తుపాన్లు, వరదలు వస్తే ఈ ప్రాంత రైతులు వణికిపోతున్నారు. సుమారు 10 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. రహదారులు మునిగిపోతున్నాయి. అయిదేళ్లుగా దీనికి పరిష్కారం దొరకలేదు. కాలువలో పూడికతీతకు ఏళ్ల తరబడి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కాలేదు. హోంమంత్రి తానేటి వనిత అందరి సమక్షంలో సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన కూడా సరే అనడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు కూడా రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా నేటికీ ఆ దస్త్రానికి మోక్షం లభించలేదు. నిధులు ఇచ్చేందుకు నీకు మనసు రాలేదా జగన్‌ అంటూ ప్రభావిత రైతులు ప్రశ్నిస్తున్నారు.


భక్తులకు పరీక్షే

నిడదవోలు పట్టణంలోని చిన్నకాశీరేవు వద్ద సుమారు 20 ఆలయాలు ఉంటాయి. పర్వదినాల్లో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో చిన్నకాశీరేవు వద్ద అప్పారావు ఛానెల్‌పై వంతెన నిర్మాణానికి రూ.4.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు.


దస్త్రాలకే  పరిమితం

ఉండ్రాజవరం మండలం వడ్లూరు నుంచి అత్తిలి కాలిబాట వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రూ.6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తీరా ప్రతిపాదనలు, నిధుల మంజూరు దస్త్రాలకే పరిమితమైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని