logo

ప్రస్తుతం రాజకీయాల్ని చూస్తుంటే జుగుప్స కలుగుతోంది : వెంకయ్యనాయుడు

ప్రస్తుతం రాజకీయాల్ని చూస్తుంటే జుగుప్స కలుగుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Updated : 13 Oct 2023 13:11 IST

గుంటూరు: ప్రస్తుతం రాజకీయాల్ని చూస్తుంటే జుగుప్స కలుగుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సదాశివరావు జీవిత విశేషాలపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు కాసరనేని వైద్య, కళా, రాజకీయ రంగాలకు చేసిన సేవల్ని కొనియాడారు.

‘ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా కాసరనేని ఎంతో సేవ చేశారు. పరోపకారం కోసం జీవితాంతం కట్టుబడ్డారు. లక్షల మంది గుండెల్లో ఆయన నిలిచిపోయారు. అరుదైన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. నీతి, నిజాయతీ, చిత్తశుద్ధితో పనిచేసేవారు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుంది. దుదదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకులు తగ్గారు. స్థాయికి తగ్గట్లుగా నాయకులు మాట్లాడట్లేదు. తప్పుడు భాష మాట్లాడేవారిని ఎన్నికల్లో ఓడించడమే సరైన మందు. ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించుకోవాలి. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. సేవా భావం ఉన్నవారు వైద్యవృత్తిలో ఉండాలి. కొందరు అనవసరంగా లేనిపోని వైద్య పరీక్షలు రాసి రోగి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేద రోగుల వద్ద డబ్బులు తీసుకోకుండా సదాశివరావు వైద్యం అందించారు. నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ ద్వారా విద్యా సంస్థలను స్థాపించారు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి. ఇతరుల కోసం మన ఆదాయంలో కొంత ఖర్చుపెట్టాలి. రైతుల హక్కుల కోసం సదాశివరావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా వైద్యుడిగా జనం గుండెలను గెలుచుకున్నారు’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని