logo

Guntur: బ్యాంకుల్లో ఇంటి దొంగలు

బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యవసనాలకు బానిసలైన కొందరు బంగారం తాకట్టు పేరుతో రూ.కోట్ల రుణాల గోల్‌మాల్‌కు పాల్పడుతున్న సంఘటనలు బాపట్లలో తరచుగా జరుగుతున్నాయి.

Updated : 07 Mar 2024 08:51 IST

నాడు బీవోబీ.. నేడు బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర.. రేపు?
బంగారం తాకట్టులో సిబ్బంది చేతివాటం
బాపట్ల, న్యూస్‌టుడే

బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యవసనాలకు బానిసలైన కొందరు బంగారం తాకట్టు పేరుతో రూ.కోట్ల రుణాల గోల్‌మాల్‌కు పాల్పడుతున్న సంఘటనలు బాపట్లలో తరచుగా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం బ్యాంకు ఆఫ్‌ బరోడాలో ఖాతాదారుల బంగారాన్ని ఉద్యోగి పేరలి సుమంత్‌ మాయం చేసి ప్రైవేటు తనఖా సంస్థల్లో రూ.2.50 కోట్లకు తాకట్టు పెట్టి భారీ మోసానికి పాల్పడ్డాడు. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో బ్యాంకులో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర 41 బినామీ ఖాతాల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.77 కోట్ల రుణాలు స్వాహా చేశాడు. రెండు ఘటనల్లో మోసం జరిగే వరకు బ్యాంకు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం. బ్యాంకుల్లో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో అక్రమాలు బయటపడ్డాయి.

రైతులు, చిరుద్యోగులే బాధితులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రైతులు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాల వారు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి సుమంత్‌ బ్యాంకులో లాకర్ల తాళాలు తెరిచి బంగారు ఆభరణాలను తీసి బయటకు తరలించాడు. రెండు ప్రైవేటు తనఖా ఆర్థిక సంస్థల్లో వాటిని తాకట్టు పెట్టి రూ.2.50 కోట్ల వరకు రుణాలు తీసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి విపరీతంగా ఖర్చు చేశాడు. బ్యాంకు లాకర్లలో భద్రంగా ఉంచాల్సిన రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బయటకు తరలిస్తున్నా బ్యాంకు మేనేజర్‌, అధికారులు గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి సహకారంతో సుమంత్‌ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పై అధికారులు బ్యాంకుకు వచ్చి నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్‌లో లాకర్లలో బంగారం మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు చేసిన ఫిర్యాదుతో నిందితులను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసి ప్రైవేటు తనఖా సంస్థల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను రికవరీ చేసి తిరిగి బ్యాంక్‌ ఆఫ్‌ ఆఫ్‌ బరోడాకు అప్పగించారు.

రెండు నెలల్లో.. 41 ఖాతాలతో..

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేసుకోవటానికి నగదు కావాల్సి వచ్చింది. నేరప్రవృత్తి కలిగిన స్నేహితులతో కలిసి బ్యాంకు నుంచి రుణాలు స్వాహా చేయటానికి పన్నాగం పన్నాడు. తమ వద్ద బంగారం ఉందని అవసరం కోసం మీ పేరు మీద తాకట్టు పెడుతున్నామని తమకు తెలిసిన వారిని నమ్మించారు. స్నేహితులు, తెలిసిన వారిని బినామీలుగా మార్చి వారి పేరు మీద నకిలీ బంగారం తాకట్టుపెట్టి 41 ఖాతాల ద్వారా రెండు నెలల్లో రూ.1.77 కోట్ల రుణాలను అక్రమంగా తీసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ బంగారాన్ని తనఖా పెట్టిన బ్యాంకులో అప్రైజరుగా ఉన్న రాఘవేంద్ర ఆభరణాలను పరిశీలించి అసలైన బంగారంగా ధ్రువీకరించటంతో బ్యాంకు అధికారులు గుడ్డిగా రుణాలు మంజూరు చేశారు. రుణాల సొమ్మును స్నేహితులతో కలిసి అతడు స్వాహా చేశాడు. అక్రమాలు వెలుగులోకి రావటంతో బినామీలుగా ఉన్నవారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పేరు మీద అసలైన బంగారం తాకట్టు పెడుతున్నామంటే నమ్మి సంతకాలు చేశామని, నకిలీ బంగారం పెట్టారన్న విషయం తమకు తెలియదని వాపోతున్నారు.

బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు అవసరం

రెండు నెలల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుంటే బ్యాంకు అధికారులకు తెలియకపోవటం నమ్మశక్యంగా లేదని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. బ్యాంకులో కొందరు సిబ్బంది సహకారం లేనిదో ఈ స్థాయిలో భారీ మోసం జరగదని తేల్చి చెబుతున్నారు. రుణాల మోసం బయటపడటంతో బినామీలుగా ఉన్నవారు బయటకు వచ్చారు. పట్టణానికి చెందిన ఓ మాజీ నేత, కొందరు వ్యక్తులు అక్రమాల వెనక ఉన్నారని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్‌జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. రుణాల స్వాహాలో బినామీలుగా ఆరోపిస్తున్న వ్యక్తులతో పాటు బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్రపైనా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని