logo

ఐపీఎస్‌, ఐఏఎస్‌ల వాట్సప్‌ డీపీలతో మోసాలు

సీనియర్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌, ఇతర శాఖల సీనియర్‌ అధికారుల చిత్రాలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులను మోసగిస్తున్న ఇద్దరిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.

Published : 06 Jul 2022 02:11 IST

బెంగళూరులో ఇద్దరి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌, స్నేహా మెహ్రా, ఏసీపీ ెకేవీఎం ప్రసాద్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: సీనియర్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌, ఇతర శాఖల సీనియర్‌ అధికారుల చిత్రాలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులను మోసగిస్తున్న ఇద్దరిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సీసీఎస్‌(డీడీ) సమావేశ మందిరంలో అదనపు డీసీపీ స్నేహా మెహ్రా, హైదరాబాద్‌ సైబర్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావులతో కలిసి జాయింట్‌ కమిషనర్‌(సీసీఎస్‌-డీడీ) గజరావు భూపాల్‌ కేసు వివరాలు వెల్లడించారు. రెండు నెలల క్రితం మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ చిత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తి ఓ వాట్సాప్‌ ఖాతాకు డీపీగా పెట్టుకున్నాడు. వివిధ కారణాలు చెప్పి ఆ శాఖ ఉద్యోగుల నుంచి రూ.1.25 లక్షల వరకు మోసగించినట్లు సైబర్‌ పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర అధికారుల చిత్రాలు డీపీలుగా పెట్టుకొని డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ నేరస్థులు ఏ శాఖ అధికారి చిత్రాన్ని డీపీగా వాడతారో..ఆ శాఖ ఉద్యోగులు, అధికారులకు మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా తమ కుటుంబ సభ్యులకు ఇబ్బంది వచ్చింది వంటి కుంటిసాకులు చెబుతూ డబ్బులు అడుగుతారు. అది డబ్బు రూపంలో కాకుండా అమెజాన్‌ గిఫ్ట్‌ ఓచర్‌, గూగుల్‌పే, ఇతర యాప్‌లకు డబ్బులు పంపించాలని చెబుతుంటారు. సంభంధిత లింక్‌లు పంపిస్తారు. వాటిని క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది. హైదరాబాద్‌ సైబర్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టి.. నిందితులు బెంగళూరు దేవనహల్లి, బోవి కాలనీ, పుట్టపస గుడి 19 వార్డులో నివాసముండే యానిమేషన్‌ ఇంజినీర్‌ రాఘవ్‌ అప్పు(19), బీహార్‌, మధుబని జిల్లా, ఝంజేపూర్‌ గ్రామం, కన్హోలికు చెందిన విద్యార్థి ఆనంద్‌కుమార్‌(21)లుగా గుర్తించారు. ఉన్నతాధికారులు ఎవరూ వారి అధికారులు, సిబ్బందికి వాట్సాప్‌ సందేశాలు, ఎస్‌ఎంఎస్‌లు పంపించి డబ్బులు కావాలి.. అది కూడా అమెజాన్‌ గిఫ్ట్‌కార్డుల రూపంలో పంపించాలని అడగరని, ఇలాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని