logo
Published : 06 Jul 2022 02:17 IST

సేవలు ఉన్నతం.. సౌకర్యాలు అవసరం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, తాండూరు పట్టణం


వికారాబాద్‌ ఆసుపత్రిలో ...

ఆరోగ్య రక్షణలో మూత్రపిండాల పాత్ర అత్యంత కీలకం. ఇవి ఏమాత్రం దెబ్బతిన్నా కష్టాలు తప్పవు. మూత్రపిండాల రోగులు తప్పని సరిగా రక్తశుద్ధిని చేయించుకోవాల్సి ఉంటుంది. వారానికి మూడుసార్లు వారు ఆసుపత్రికి రావాలి. గతంలో ఇలాంటి వారికి స్థానికంగా డయాలసిస్‌ కేంద్రం అందుబాటులో లేక హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది. ఇదెంతో కష్టంతో కూడిన పని. వీరి అవస్థలను గుర్తించిన ప్రభుత్వం వికారాబాద్‌లో, తాండూరులో రక్తశుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా వారికి అత్యంత ఖరీదైన సేవలు ఉచితంగానే లభిస్తున్నాయి. ఇదే సమయంలో వైద్యు సంఖ్యను, ఆధునిక యంత్రాలను సమకూర్చాల్సి ఉంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

2017లో ఏర్పాటు:  * వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్త శుద్ధి (డయాలసిస్‌) కేంద్రాన్ని 2017 నవంబర్‌ 27న రోజున ప్రారంభించారు. అలాగే తాండూరులోనూ ఇదే ఏడాది అందుబాటులోకి తెచ్చారు. * కొడంగల్‌లో ఇటీవలే మంత్రి హరీశ్‌రావు కొత్త కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. పరిగిలో త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. * ప్రస్తుతం వికారాబాద్‌ పరిసర మండలాలతో పాటు పరిగి, కుల్కచర్ల, బొంరాస్‌పేట, నవాబ్‌పేట, మర్పల్లి, చేవెళ్ల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు వీటి రాకతో హైదరాబాద్‌ వెళ్లే సమస్య తప్పింది. * వికారాబాద్‌ రక్త శుద్ధి కేంద్రంలో 5 పడకలున్నాయి. 5 పరికరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో విడతలో 5 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్‌కార్డు ఉన్న వారికి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లేఖ ఉన్నట్లయితే వైద్యంతోపాటు మందులూ ఉచితమే. * వికారాబాద్‌ కేంద్రంలో రోగుల సంఖ్యకు తగినట్లుగా మరిన్ని వసతులు సమకూర్చాల్సి ఉంది. వైద్య సిబ్బందిని పెంచాల్సి ఉంది. మందుల కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ అవసరమని రోగులు పేర్కొంటున్నారు.

సర్జన్‌ను నియమిస్తే మరింత ప్రయోజనం

తాండూరు పట్టణంలో 8 పడకలతో డయాలసిస్‌ కేంద్రం పనిచేస్తోంది. రోజుకు మూడు విడతల్లో రక్త శుద్ధి చికిత్సలు అందిస్తున్నారు. ఒక్కోసారి రోజుకు 32 మందికి మందికి సేవలు చేస్తున్నారు. రక్త శుద్ధి చేసేందుకు రోగులకు ఏవీ పిస్తుల(ఆర్టీరియో వెన్యూ పిస్తుల)ను అమర్చాల్సి ఉంటుంది. ఈ పరికరం ఇక్కడలేక రోగులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ లేదా గాంధీ ఆస్పత్రికి వెళ్లి అమర్చుకుని రావాల్సి వస్తుంది. దీనికి ప్రైవేటులో రూ.30 నుంచి రూ.50 వేల దాకా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేదంతా పేద వారే కావడంతో అంత ఖర్చు భరించ లేక 110 కిలో మీటర్ల దూరంలోని రాజధానికి వెళ్లక తప్పడంలేదు. ఏవీ పిస్తుల సౌకర్యం కల్పించాలంటే వాస్కోలర్‌ సర్జన్‌ను నియమించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

* జిల్లా ఆస్పత్రిలో పై అంతస్తులో డయాలసిస్‌ కేంద్రం ఉండటంతో బాధితులు పైకి ఎక్కటానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కేంద్రాన్ని కిందికి మార్చాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత కూడా నెలకుంది.

ప్రభుత్వానికి గతంలోనే విన్నవించాం : డా. రవిశంకర్‌, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు, తాండూరు

జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత, పరికరాల సమకూర్పు తదితర అంశాలపై ప్రభుత్వానికి గతంలోనే విన్నవించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులతోనే సేవలు అందిస్తున్నాం. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం.

50 మందికి వైద్యం చేస్తున్నాం : : మహ్మద్‌ రిజ్వాన్‌ ఇన్‌ఛార్జి రక్తశుద్ధి కేంద్రం, వికారాబాద్‌

ఈ కేంద్రంలో ప్రస్తుతం 50 మందికి డయాలసిస్‌ చికిత్స చేస్తున్నాం. ముందుగా పేరు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోగికి నెలకు నాలుగు రక్తానికి సంబంధించిన ఇంజక్షన్లు, ఐరన్‌ ఇంజక్షన్లు రెండు ఇస్తున్నాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని