logo

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య... నవాబుపేట మండలంలో పలు చోట్ల స్థిరాస్తి వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ,

Published : 07 Aug 2022 02:27 IST

జడ్పీ సమావేశంలో మంత్రి సబితారెడ్డి


మాట్లాడుతున్న సబితారెడ్డి, చిత్రంలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి

 

చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య... నవాబుపేట మండలంలో పలు చోట్ల స్థిరాస్తి వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌కు రంగారెడ్డి జిల్లా పరిషత్‌ నుంచి రావాల్సిన రూ.12 కోట్లు ఇంకా రాలేదని, నిధులు వచ్చేలా మంత్రి చొరవ చూపాలని కోరారు.

పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, పరిగి, పూడూర్‌ మండలాల్లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, పంటల నష్టం అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అన్నారు. ఆయుష్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదనడం సరికాదని, తన దృష్టికి తీసుకొస్తే టెండర్లు వేయిస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, వికారాబాద్‌

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేసి, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర విద్యా శాఖమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం పురపాలక సంఘం పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లి డీపీఆర్‌సీ భవనంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేసేది ప్రజల కోసమేనని, ఎవరైనా అధికారికి ప్రజాప్రతినిధి ఫోన్‌ చేస్తే తప్పనిసరిగా స్పందించాలని తెలిపారు. మన ఊరు- మన బడి కింద మంజూరైన పనులను విద్యా కమిటీ అధ్యక్షులు చేయడానికి ముందుకు రాకపోతే, సర్పంచులు, ఎంపీటీసీలకు పనులు అప్పగించాలని చెప్పారు.

సత్వరం బాధితుల నివేదిక

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల, వంతెనల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరదలకు వాగులు పొంగి పొర్లి పంటలు నష్టపోవడంతో పాటు పశువులు, జిల్లాలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల వివరాలతో నివేదికను రూపొందించాలని అధికారులకు సూచించారు.

* రూ.3 కోట్లతో జిల్లా పరిషత్‌ భవనం నిర్మిస్తున్నామని, కోట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటితో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వార్చే ఏజెన్సీలు కొనసాగడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నది, లేనిది వివరాలు సేకరించాలని సూచించారు.

హాజరైన వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి,
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

శిథిల ఇళ్లపై వెంటనే స్పందించండి: ఎమ్మెల్యే ఆనంద్‌

గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను కూల్చి వేయాలని ప్రభుత్వం చెప్పినా ఇప్పటికీ అలాగే ఉన్నాయని వెంటనే స్పందించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సమావేశంలో అన్నారు. పంచాయతీల ద్వారా తీసుకున్న ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ చిన్న పంచాయతీలకు భారంగా మారిందని, ప్రత్యేక నిధులు కేటాయించి భారం తగ్గించేలా చూడాలన్నారు.

* వర్షాలకు అన్ని పంటలకు నష్టం వాటిల్లి పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని, రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి నిఖిల, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, డీపీఓ మల్లారెడ్డి, డీఎఫ్‌ఓ వేణుమాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని