logo

లొట్టలేస్తూ తినాలి..చిట్టి పొట్టలు నిండాలి!

కరోనా ఉద్ధృతిలో ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లలు ఇంటిపట్టున ఉండడంతో ఏం తింటున్నారో.. తల్లిదండ్రులకు తెలిసేది. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు జరుగుతుండడంతో అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం వరకు బడిలోనే కానిస్తున్నారు. చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజనం తినకుండానే వెనక్కి తెస్తున్నారు.

Published : 14 Aug 2022 03:03 IST

పిల్లల ఆసక్తికనుగుణంగా భోజనం ఉండాలి

 అప్పుడే లంచ్‌ బాక్సు వెనక్కి తీసుకురారంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌

కరోనా ఉద్ధృతిలో ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లలు ఇంటిపట్టున ఉండడంతో ఏం తింటున్నారో.. తల్లిదండ్రులకు తెలిసేది. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు జరుగుతుండడంతో అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం వరకు బడిలోనే కానిస్తున్నారు. చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజనం తినకుండానే వెనక్కి తెస్తున్నారు. ఇంటికి తెస్తే.. అమ్మ ఏమంటుందో అనే భయంతో కొందరు చెత్తబుట్టలో పారేస్తున్నారు. టీచర్లు చెప్పేవరకు ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలు శ్రద్ధగా తినకపోవటానికి రకరకాల కారణాలుంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సమయం లేక హడావుడిగా భోజనం, అల్పాహారాలు సర్దడం వల్ల పిల్లలు తినేందుకు ఆసక్తి చూపరు. కొందరు పైపైన తిని మిగతాది పడేస్తుంటారు. ఇది పౌష్టికాహార లోపానికి దారితీస్తుంది. రక్తహీనతకు కారణమవుతుంది. పిల్లలకు పెట్టే అల్పాహారం, మధ్యాహ్న భోజనం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాహార నిపుణులు ఏం సూచిస్తున్నారు
* అల్పాహారంలో పాలు, గింజలు, తృణ ధాన్యాల పొడితో తయారు చేసిన చపాతీ, ఇడ్లీ, ఉప్మా, తాజా పండ్లు భాగం చేయాలి. పండ్లు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో భాగం కావాలి. మధ్యాహ్న భోజనం వేడిగా ఉండేలా చూడాలి.
* స్నాక్స్‌ తింటే మధ్యాహ్న భోజనంపై ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే స్నాక్స్‌ మధ్యాహ్న భోజనం తర్వాత తినేలా చూడాలి.
* లంచ్‌బాక్సులో సంతృప్తికర కొవ్వులున్న కొలెస్ట్రాల్‌ లేని ఆహారం పెట్టాలి. ఎదిగే పిల్లలకు గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్‌, చేపలు, సోయా లేదా ఇతర ప్రోటీన్లు ఉన్న ఆహారం అందించాలి. నాన్‌వెజ్‌ను అనుమతించకపోతే.. సోయా, పప్పులు ఇతర ప్రోటీన్లు ఉన్న ఆహారం పెట్టాలి. ఇంటివద్ద మాంసాహారం ఇవ్వాలి.
* పదార్థాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. బొమ్మల ఆకృతిలో పండ్లను, సలాడ్‌లను తయారు చేస్తే ఆకట్టుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని