logo

ఆర్థిక, సాంకేతిక రంగాల్లో శక్తిమంతంగా భారత్‌

వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని 600 గ్రామాలు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో డిజిటలైజేషన్‌ కానున్నాయని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

Published : 02 Oct 2022 03:50 IST

 హెచ్‌సీయూ 22వ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వేదికపై రిజిస్ట్రార్‌ దినేష్‌ నిగమ్‌, గవర్నర్‌ తమిళిసై, ఛాన్స్‌లర్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని 600 గ్రామాలు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో డిజిటలైజేషన్‌ కానున్నాయని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ప్రధాన టెలీ నెట్‌వర్క్‌లు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకుంటాయని, బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం మన ఐఐటీలు తయారు చేసిన దేశీయ సాంకేతికతను వినియోగించుకోనుందని చెప్పారు. భారతదేశం ఆర్థికంగానే కాకుండా సాంకేతికతంగా శక్తిమంతమైనదిగా ఎదగనుందన్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం శనివారం గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ ఐటీ రంగంతోపాటు మెడికల్‌, సాంకేతికతకు కేంద్రంగా ఎదుగుతోంది. భారత్‌ బయోటెక్‌ హైదరాబాద్‌ కేంద్రంగానే వ్యాక్సిన్‌ను తీసుకువచ్చిన విషయమే ఇందుకు ఉదాహరణ. సమాజం ఎదగాలంటే.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అవసరం. కొవిడ్‌-19 తర్వాత భారతీయ ఆహార, సంప్రదాయ జీవన విధానాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోంది’ అని పేర్కొన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం మాతృభాషలో బోధనకు పెద్దపీట వేస్తోందన్నారు. మాతృభాష బోధనతో విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అంతకుముందు.. గత మూడేళ్లలో 4,800 మంది డిగ్రీలు పూర్తి చేయగా.. వారిలో బంగారు పతకాలు సాధించిన 484 మందికి ధర్మేంద్ర ప్రధాన్‌, తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా, పీహెచ్‌డీ పట్టాలు జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి చేతుల మీదుగా అందించారు.  హెచ్‌సీయూ కులపతి జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, ఉపకులపతి ప్రొ.బీజేరావు, రిజిస్ట్రార్‌ దేవేశ్‌నిగమ్‌, ఇఫ్లూ ఉపకులపతి ప్రొ.ఇ.సురేశ్‌కుమార్‌, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని