logo

బిహార్‌కు తిరిగొస్తానంటే వద్దన్న తల్లి.. చెరువులో దూకిన బాలుడు

స్వరాష్ట్రానికి తిరిగొస్తానంటే తల్లి ససేమిరా అనడంతో ఓ బాలుడు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. 

Published : 24 Nov 2022 01:50 IST

రక్షించిన స్థానిక యువకుడు, చాంద్రాయణగుట్ట పోలీసులు

జాస్మిన్‌సాదీకి నగదు బహుమతి అందజేస్తున్న ఎస్సై జి.శేఖర్‌

కేశవగిరి, న్యూస్‌టుడే: స్వరాష్ట్రానికి తిరిగొస్తానంటే తల్లి ససేమిరా అనడంతో ఓ బాలుడు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.  ఎస్సై జి.శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన బద్రిదాస్‌ దంపతులు రెండు రోజుల క్రితం తమ కుమారుడి(13)ని తీసుకొచ్చి పాతబస్తీ భవానీనగర్‌ తలాబ్‌కట్టలోని గాజుల తయారీ పరిశ్రమలో పనికి కుదిర్చి వెళ్లిపోయారు. యజమాని ఆ బాలుడికి అదే ప్రాంతంలో ఆశ్రయం కల్పించాడు. బాలుడు తల్లికి ఫోన్‌  చేసి ఇంటికి తిరిగి వస్తానని కోరాడు. తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురై బుధవారం బార్కస్‌ బాలాపూర్‌ రోడ్డులోని గుర్రం చెరువులోకి వెళ్లాడు. ఈ విషయాన్ని స్థానిక యువకుడు జాస్మిన్‌ సాదీ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై, ఏఎస్సై సీతాపతిరావు, కానిస్టేబుళ్లు రాఘవేందర్‌, ఇమ్రాన్‌ చెరువు వద్దకు చేరుకొని, జాస్మిన్‌సాదీ సాయంతో మునిగిపోతున్న బాలుడిని బయటకు లాగి రక్షించారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని రక్షించడంలో చొరవ చూపిన జాస్మిన్‌సాదీ(21)కి పోలీసులు నగదు బహుమతి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని