logo

పది.. ఉత్తమ ఫలితమే లక్ష్యం

విద్యార్థుల భవితకు పదో తరగతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు.

Published : 29 Nov 2022 04:50 IST

డిసెంబరు నుంచి ప్రత్యేక తరగతులు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: విద్యార్థుల భవితకు పదో తరగతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు. ఇదే ఉద్దేశంతో వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపి వంద శాతం ఫలితాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలుకు సన్నద్ధమయ్యారు. డిసెంబరు ఒకటి నుంచి జిల్లాలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా 13,360 మంది

జిల్లాలోని 19 మండలాల్లో 154 ఉన్నత పాఠశాలలున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి 13,360 మంది ‘పది’ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయటానికి సిద్ధమవుతున్నారు. 2021-22 ఏడాదిలో 14,226 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 90.42 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 24వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది మరింత మెరుగైన స్థానం సాధించాలనే తపనతో విద్యాశాఖ అధికారులు ఫలితాలపై దృష్టి సారించారు.  

ఉదయం... సాయంత్రం

వార్షిక పరీక్షల నిర్వహణకు మూడు నెలల ముందుగానే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి పాఠ్యాశాల బోధన పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే నెల మొదటి నుంచి పునశ్ఛరణ  తరగతులు ప్రారంభించి ప్రత్యేక తరగతులను పరీక్షలు ప్రారంభమయ్యే వరకు కొనసాగిస్తారు. అందుకు అనుగుణంగా సమయ సారిణి తయారు చేయగా ఉదయం, సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించనున్నారు. నిత్యం పాఠ్యాంశాల వారిగా తరగతులు సాగుతాయి. ప్రతి ఆదివారం, రెండో శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండింటికీ పరీక్షలు నిర్వహించి, మార్కుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తారు. అనంతరం వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సాధన చేయిస్తారు. దీక్ష యాప్‌, ఆన్‌లైన్‌, డిజిటల్‌ తరగతులతో పాటుగా పాఠ్య పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేసి పాఠ్యాంశాల వారిగా రాసుకుంటూ ఇంటిపని చేసుకోవాలని సూచిస్తున్నారు.


మార్గదర్శకాలు తెలియజేశాం
- రేణుకా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి

ఉపాధ్యాయులు, విద్యాశాఖ సమష్టి కృషితో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా సమన్వయం చేస్తున్నాం. ప్రత్యేక తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలను తెలియజేశాం. డిసెంబరులో పాఠ్యాంశాల బోధన పూర్తి చేసుకుంటూ పునశ్ఛరణ చేపట్టాలి. రెండు, మూడేళ్ల ప్రశ్నపత్రాలతో ముఖ్యమైన ప్రశ్నలపై శ్రద్ధ చూపాలి. మెరుగైన స్థానంతో ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని