logo

‘పట్టు’ చేపట్టు.. ఆదాయం రాబట్టు

సంప్రదాయ పంటలే కాకుండా అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో పట్టు పురుగుల పెంపకం చక్కటి అవకాశంగా మారుతోంది. ప్రభుత్వం పలు రాయితీలను కూడా కల్పిస్తోంది.  

Updated : 30 Nov 2022 03:46 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి

సంప్రదాయ పంటలే కాకుండా అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో పట్టు పురుగుల పెంపకం చక్కటి అవకాశంగా మారుతోంది. ప్రభుత్వం పలు రాయితీలను కూడా కల్పిస్తోంది.  
మరో 200 ఎకరాల్లో విస్తరించాలన్నదే లక్ష్యం ప్రస్తుతం జిల్లాలో 220 ఎకరాల్లో 150 మంది రైతులు మల్బరీ ఆకులను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం అదనంగా మరో 200 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయంలో పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించారు. ఎక్‌మామిడి, దుర్గంచెర్వు, మర్పల్లి, తాండూరు, పెద్దేముల్‌ తదితర గ్రామాల్లో ఈ తోటలు ఉన్నాయి.

ఇవీ రాయితీలు: పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌కేవీవై పథకం కింద రాయితీని అందిస్తోంది. పట్టు పురుగులను పెంచేందుకు నిర్మించే షెడ్డుకు మొత్తం రూ.4 లక్షలు వ్యయం కాగా కేంద్రం ఎస్సీలకు 60 శాతం (రూ.2.60 లక్షలు), బీసీ, ఇతరులకు రూ.50 శాతం (రూ.2 లక్షలు) రాయితీ ఇస్తోంది.

* ఇప్పటికే ఈ పథకం కింద జిల్లాలో 51 మంది రైతులకు షెడ్ల నిరాణానికి రూ.కోటి 20 లక్షల రాయితీని ఇచ్చారు. ఒకటి నుంచి 5 ఎకరాల వరకు ఎకరాకు మల్బరీ సాగుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.32,500లు బీసీ, ఇతర రైతులకు రూ.25 వేలు రాయితీని మంజూరు చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు గూళ్లను అధిక ధరకు కొనుగోలు చేస్తోంది. వికారాబాద్‌లో రెయిలింగ్‌ కేంద్రంలో పట్టు గూళ్లను కొనుగోలు చేస్తున్నారు.

ఎంతో బాగుంది
పి. చంద్రశేఖర్‌, రైతు, దుర్గంచెరువు

3 సంవత్సరాల క్రితం 3 ఎకరాల్లో పట్టు పరిశ్రమను ప్రారంభించాను. ఇతర పంటలతో పోల్చి చూస్తే ఈ పరిశ్రమ ఎంతో బాగుంది. వర్షాలతో ఈసారి పంటలన్నీ దెబ్బతిన్నాయి. పట్టు పరిశ్రమకు మాత్రం పెద్దగా నష్టం రాలేదు.

అవగాహన కల్పిస్తున్నాం..
చక్రపాణి, ఉద్యాన, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి

పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పరిశ్రమను చేపట్టడం ద్వారా సులభంగా ఎకరానికి రూ.1.50 నుంచి 2 లక్షల వరకు సంపాదించవచ్చని సూచిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని