logo

ఇచ్చిందే లెక్క.. చెప్పిందే ధర..!

పత్తి వ్యాపారులు సిండికేట్‌గా మారి రోజురోజుకు ధరలు తగ్గిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 Dec 2022 02:24 IST

వ్యాపారుల సిండికేట్‌తో నష్టపోతున్న రైతన్నలు

న్యూస్‌టుడే, బషీరాబాద్‌, పాత తాండూరు: పత్తి వ్యాపారులు సిండికేట్‌గా మారి రోజురోజుకు ధరలు తగ్గిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎంత  అంటే అంతే ధర పెడుతున్నారని, సరిహద్దు కర్ణాటకలో, ఇతర ప్రాంతాల్లో ధర ఎక్కువగా ఉన్నా.. తేమ, పత్తి నాణ్యతగా లేదని సాకులు చెబుతూ ధర తగ్గిస్తున్నారని పేర్కొంటున్నారు.  

52 వేల ఎకరాల్లో..:

తాండూరు నియోజక వర్గంలోని బషీరాబాద్‌, తాండూరు, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లో సుమారు 52వేల ఎకరాల్లో రైతులు పత్తి పండిస్తున్నారు. యాలాల మండల పరిధిలోని మూడు పత్తి మిల్లులు, పెద్దేముల్‌ మండలంలోని ఒక పత్తి మిల్లుకు రైతులు పత్తిని తరలిస్తున్నారు. మద్దతు ధర రూ.6,380 మించి ధర ఉండడంతో ఈసారి సీసీఐ కొనడం లేదు. వర్షాల కారణంగా దిగుబడి పడిపోవడంతో పత్తికి డిమాండ్‌ పెరిగింది. ధర సైతం మద్దతుకు మించి పలుకుతుండడంతో ఇదే అదనుతో పక్షం రోజుల క్రితం రూ.9,280 గరిష్ఠంగా పలికిన ధర ప్రస్తుతం గరిష్ఠంగా రూ.8,600 నుంచి 8,800 వరకు తగ్గించారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇప్పటి వరకు 35 వేల క్వింటాళ్లే విక్రయం..

యాలాల మండల పరిధిలోని మూడు పత్తి మిలుల్లో బుధవారం నాటికి 33వేల క్వింటాళ్లు.. గురువారం వరకు సుమారు 35వేల క్వింటాళ్ల పత్తి విక్రయాలు మాత్రమే జరిగినట్లు విపణి అధికారులు చెబుతున్నారు. మిల్లులో విపణి అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. 

*  యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌-దౌలాపూర్‌ మార్గంలోని ఓ పత్తి మిల్లులో ఇటీవల తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆధారాలతో బయటపెట్టి గొడవకు దిగిన సంఘటన తెలిసిందే. ఇదే దారిలో ఉన్న ఓ పత్తి మిల్లులో బిల్లులు నమోదు చేయకుండానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు.

లెక్క బయట పడుతుంది: రాజేశ్వరి, విపణి కార్యదర్శి, తాండూరు

వ్యాపారులు విపణి ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తే లెక్కల్లో తేలుస్తాం. మిల్లుకు వచ్చిన పత్తిని దూది, విత్తు వేరు చేసిన తరువాత బయటికి పంపించే సమయంలో లెక్క తేలుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని