logo

రయ్‌.. రయ్‌.. రేసుకు సై

నగరంలో మళ్లీ రెండు రోజులపాటు కార్ల రేసింగ్‌ సందడి షురూ కానుంది. శని, ఆదివారాల్లో హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి.

Published : 10 Dec 2022 03:25 IST

నేడు, రేపు ఇండియన్‌ లీగ్‌ పోటీలతో ఉత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో మళ్లీ రెండు రోజులపాటు కార్ల రేసింగ్‌ సందడి షురూ కానుంది. శని, ఆదివారాల్లో హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. సాగర తీరాన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ గార్డెన్‌ వైపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ పోటీలు శనివారం ఉదయం నుంచే మొదలుకానున్నాయి. నవంబరు 19, 20 తేదీల్లో ఐఆర్‌ఎల్‌ తొలిరౌండ్‌ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. రేసుల సందర్భంగా ట్రాక్‌లో జరిగిన ప్రమాదంలో ఒక రేసర్‌ గాయపడటంతో అర్ధాంతంగా ఈ లీగ్‌ నిలిచిపోయింది.

ఐఆర్‌ఎల్‌ రద్దయినప్పటికీ.. అదే ట్రాక్‌లో జరిగిన జాతీయ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రేక్షకులను అలరించింది. తాజాగా నాలుగో రౌండ్‌ పోటీలకు రేసింగ్‌ ప్రమోషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆర్‌పీపీఎల్‌) అంతా సిద్ధం చేసింది.

* వచ్చే ఫిబ్రవరి 11న ఇదే ట్రాక్‌పై ఫార్ములా-ఈ రేస్‌ పోటీలు జరగనున్న దృష్ట్యా.. ప్రస్తుతం సింగిల్‌ సీటర్‌ పెట్రోల్‌ కార్లతో రేసింగ్‌ లీగ్‌ పోటీలు కొనసాగిస్తున్నారు. ఇవి ట్రయిల్‌రన్‌లా ఉపయోగపడనున్నాయి.

ప్రారంభమైన ట్రాఫిక్‌ కష్టాలు..

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలను దృష్టిలో పెట్టుకొని హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ట్రాఫిక్‌ను మళ్లించడంతో శుక్రవారం సాయంత్రం నుంచే  కష్టాలు ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాల్లో లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, మాసబ్‌ట్యాంకు, అమీర్‌పేట, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడనుంది. నవంబరు 19, 20 తేదీల్లోనూ తొలి రౌండ్‌ పోటీల సందర్భంగా ట్రాఫిక్‌ ఆటంకం ఏర్పడింది.

* సచివాలయం, ఎన్టీఆర్‌పార్కు, ఐమాక్స్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా 2.7కిలోమీటర్ల మేరకు స్ట్రీట్‌ సర్క్యూట్‌లో పోటీలు జరుగుతున్న దృష్ట్యా అటువైపు వాహనాలు రాకుండా పూర్తిగా నిలిపివేశారు. ఆ ప్రభావం నగర ట్రాఫిక్‌పై పడుతోంది. అప్పుడు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరోసారి ఈ పోటీలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మ్యూజిక్‌ షోతో మజా..

రేసింగ్‌ పోటీలకు మరింత హుషారు తెచ్చేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తన మ్యూజిక్‌ షోతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 6-8 వరకు ఈ షో జరగనున్నట్లు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని