logo

ప్రజా ధనం.. సద్వినియోగమే లక్ష్యం

ఏ పనికైనా ప్రణాళిక ముఖ్యమని, ప్రజల సొమ్మును సద్వినియోగం చేయడంతో మరింత పటిష్ఠ కార్యాచరణ అవసరమని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి (సీపీఓ) సి.నిరంజన్‌రావు అన్నారు.

Published : 06 Feb 2023 00:52 IST

జిల్లా ముఖ్యప్రణాళికాధికారి నిరంజన్‌రావు ‘న్యూస్‌టుడే’తో

న్యూస్‌టుడే, వికారాబాద్‌: ఏ పనికైనా ప్రణాళిక ముఖ్యమని, ప్రజల సొమ్మును సద్వినియోగం చేయడంతో మరింత పటిష్ఠ కార్యాచరణ అవసరమని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి (సీపీఓ) సి.నిరంజన్‌రావు అన్నారు. వివిధ పద్దుల కింద మంజూరైన డబ్బులను వృథా కాకుండా అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయిస్తున్నట్లు ఆయన అన్నారు. నూతన బడ్జెట్‌, పన్నుల వసూళ్లు, తదితర ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రగతి పనులకు నిధుల కేటాయింపు, సద్వినియోగం తదితర అంశాల గురించి ఆయనతో ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ‘ముఖా ముఖి’.. వివరాలిలా...

ప్ర: జిల్లాకు ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన నిధుల వివరాలు ఎలా ఉన్నాయి.
జ: 2022-23 సంవత్సరానికి పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. అభివృద్ధి పథకాలకు కేటాయింపు జరిగింది. ఎమ్మెల్సీ కోటా కింద కూడా రూ.3 కోట్లు మంజూరయ్యాయి.

ప్ర: ఎంపీ కోటా నిధుల మాటేమిటి.
జ: చేవెళ్ల ఎంపీ కోటా నిధులు 2019-20 సంవత్సరంలో రూ.2 కోట్లు, మహబూబ్‌నగర్‌ ఎంపీ కోటా కింద రూ.50 లక్షలు వచ్చాయి. వీటిని పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని కొడంగల్‌ ప్రాంతంలో అభివృద్ధి పనులకు కేటాయించాం.  

ప్ర: ప్రత్యేక అభివృద్ధి నిధులను ఏంచేస్తున్నారు..
జ: జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలతో పాటు చేవెళ్ల నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్‌డీఎఫ్‌ కింద ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేశారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు వచ్చాయి. వీటిని కేటాయించడానికి వివిధ అభివృద్ధి పనులను గుర్తించే పనిలో ఉన్నారు.

ప్ర: జిల్లాకు మరేవైనా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయా.
జ: తాండూర్‌ నియోజకవర్గానికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్‌డీఎఫ్‌ కింద రూ.134 కోట్లు మంజూరయ్యాయి. వీటితో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయి.

ప్ర: ఇతర కార్యక్రమాలేవైనా మీ శాఖ పరిధిలో చేపడుతున్నారా.
జ: ప్రతి సీజన్‌లో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నాం. వీటి ఆధారంగా రానున్న వ్యవసాయ సీజన్‌కు అవసరమైన పంటల దిగుబడులు, విత్తనాలకు సంబంధించి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని