logo

దూసుకెళ్లడానికి సిద్ధం!

అంతర్జాతీయ స్థాయి ఫార్ములా-ఈ పోటీలకు నగరం సిద్ధమైంది. ఈనెల 11న జరగనున్న రేస్‌ కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

ఎన్టీఆర్‌ ఘాట్‌లో రేసింగ్‌ ట్రాక్‌..

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి ఫార్ములా-ఈ పోటీలకు నగరం సిద్ధమైంది. ఈనెల 11న జరగనున్న రేస్‌ కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, ఐమాక్స్‌ పరిసర ప్రాంతాలు కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రమణాలతో 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ ఏర్పాటవుతోంది. 20వేల మంది పోటీలను తిలకించేలా పదిప్రాంతాల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దిగ్గజ 11 ఆటోమొబైల్‌ కంపెనీల 22 మంది డ్రైవర్లు కొత్త ఎలక్ట్రిక్‌ కార్లతో సత్తా చాటనున్నారు. గంటకు 330 కిలోమీటర్ల గరిష్ట వేగంతో అవి దూసుకుపోనున్నాయి. ఇప్పటికే ప్రత్యేక కార్గో విమానంలో నగరానికి చేరాయి. విడిభాగాలుగా వచ్చిన ఇవి ఐమాక్స్‌ పక్కనే ప్రత్యేకషెడ్లలో సిద్ధమవుతున్నాయి

సందడే సందడి..

పోటీల్లో భాగంగా నాలుగు రోజుల ముందు నుంచే వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించే సాధన రేస్‌లకు పాఠశాలల పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. 11న అసలైన సమరం ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు క్యాలిఫైయింగ్‌ రేస్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాన రేస్‌ జరగనుంది. ఎలక్ట్రిక్‌ కార్లతో ఫార్ములా ఈ-రేస్‌కు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని