logo

అటకపైకి 3 లక్షల అర్జీలు

గ్రేటర్‌ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల్లో 50శాతం అటకెక్కినట్లే. దరఖాస్తుదారులు ఎవరు, ఎక్కడున్నారు, వారి ఫోన్‌ నంబరు ఏంటి, ఓటరు కార్డు ఏ నియోజకవర్గంలో ఉందనే వివరాలను అందించకపోవడంతో.. సుమారు 3లక్షల దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ పక్కన పెట్టింది.

Published : 04 Mar 2023 01:59 IST

వివరాలున్న ‘డబుల్‌’ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి
త్వరలోనే సర్కారుకు జీహెచ్‌ఎంసీ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల్లో 50శాతం అటకెక్కినట్లే. దరఖాస్తుదారులు ఎవరు, ఎక్కడున్నారు, వారి ఫోన్‌ నంబరు ఏంటి, ఓటరు కార్డు ఏ నియోజకవర్గంలో ఉందనే వివరాలను అందించకపోవడంతో.. సుమారు 3లక్షల దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ పక్కన పెట్టింది. వివరాలు అందించిన దరఖాస్తుదారుల జాబితాను సిద్ధం చేసింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పరిశీలన పూర్తయిన దరఖాస్తుల వివరాలను అందించాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెండింగులోని దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఏడేళ్లుగా ఎదురు చూపులు..

నగరంలో ఏడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికలు జరిగాయి. ప్రచార సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రేటర్‌లోని పేదలకు లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి, ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అనుకున్నట్లు.. కొన్నేళ్లకు నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం 65వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. పంపిణీకి మాత్రం నోచుకోవట్లేదు. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, త్వరగా పంపిణీ చేపట్టాలని పౌరులు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో.. ఇళ్ల పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలనను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. అందులో మొత్తం 7.09లక్షల దరఖాస్తులున్నాయి. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ఆయా వివరాలను సర్కిల్‌ కార్యాలయాలకు అందించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల ఓటరు, ఆధార్‌ కార్డు వంటి వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఆ మేరకు సర్కిళ్ల పరిధిలోని బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది.. కొంత కాలంపాటు దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. కొందరి ఫోన్‌ నంబర్లు, చిరునామా సవ్యంగా లేకపోవడంతో.. అవి పక్కన పెట్టారు. ఇందులో  జీహెచ్‌ఎంసీ వెలుపల నుంచి వచ్చిన 1,03,499 దరఖాస్తులు,  కంటోన్మెంట్‌ పరిధి నుంచి వచ్చిన 12,568 అర్జీల్లో 70 శాతం పైగా వివరాలు లేకపోవడంతో వాటిని పరిశీలించ లేకపోయారు. దీంతో మొత్తంగా వచ్చిన  7 లక్షల దరఖాస్తుల్లో సుమారు 3లక్షల అర్జీలు అటకెక్కినట్లయ్యింది.


రెండు, మూడు దశల్లో..

రిశీలన పూర్తయిన వివరాలను త్వరలో సర్కారు అందించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం చెబుతోంది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన దరఖాస్తులే కాకుండా.. పీఎం ఆవాస్‌ యోజన వెబ్‌సైట్లోని దరఖాస్తులను కూడా పరిశీలించాల్సి ఉందని, సర్కారు ఆయా దరఖాస్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని యంత్రాంగం తెలిపింది. నగరంలో ఇళ్ల పంపిణీ ఒకేసారి జరగదని, రెండు లేదా మూడు దశల్లో జరిగే అవకాశముందని, లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని