logo

5,903మందిలో మీరు చేరొద్దు

5,903.. ఈ సంఖ్య ఏంటని అనుకుంటున్నారా? జీవన్‌దాన్‌ ట్రస్టులో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న బాధితుల సంఖ్య. వివిధ కారణాలతో మూత్రపిండాలు పాడై కిడ్నీ దాత కోసం నిరీక్షిస్తున్నారు.

Published : 09 Mar 2023 03:08 IST

నేడు ప్రపంచ కిడ్నీల దినం

ఈనాడు, హైదరాబాద్‌: 5,903.. ఈ సంఖ్య ఏంటని అనుకుంటున్నారా? జీవన్‌దాన్‌ ట్రస్టులో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న బాధితుల సంఖ్య. వివిధ కారణాలతో మూత్రపిండాలు పాడై కిడ్నీ దాత కోసం నిరీక్షిస్తున్నారు. తమ వంతు వచ్చేలోపు వీరిలో కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలోకి చేరిన వ్యర్థాలను వడకడుతూ.. ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కిడ్నీలది. వివిధ కారణాలతో ప్రస్తుతం సమస్యలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో 5-6 వేల మంది కిడ్నీల వైఫల్యం కారణంగా డయాలసిస్‌ చేసుకుంటున్నారు. ఒక్క నిమ్స్‌లోనే 500 మంది చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల్లో 40-50 శాతం 40-45 ఏళ్ల లోపు వాళ్లు ఉంటున్నారు. గురువారం ప్రపంచ కిడ్నీల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

వైఫల్యానికి ప్రధాన కారణాలు... :

* నియంత్రణలోలేని అధిక రక్తపోటు, మధుమేహం

* జన్యుపరమైన కారణాలు

* నెలలు నిండక ముందు, బరువు తక్కువతో పుట్టిన పిల్లలు

* ఒత్తిడి, ఆహారపు అలవాటు, పొగతాగడం

ఇవీ లక్షణాలు.. :

* శరీరమంతా వాచి పోయి ఉండటం

* ఆకలి తక్కువ. వాంతులు, వికారం

* కొంచెం నడిచినా ఆయాసం, నీరసం

* నిద్రలోనే మూత్రం పోయడం

* మూత్రవిసర్జనలో మంట, చీము, రక్తం రావటం

* కడుపులో పుండ్లు, కాళ్లు, నడుమలో నొప్పులు.


లక్షణాలు ఉన్నా పట్టించుకోవడం లేదు

అధిక రక్తపోటు, మధుమేహం రోగులు మూడు నెలలకు ఒకసారైనా పరీక్షలు చేసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే మిగతా వారు అప్రమత్తం కావాలి. మూత్రంలో సుద్ద ఎక్కువగా పోతుంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతున్నట్టే. ఏటా ఈ పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి.

డా.శ్రీభూషణ్‌రాజు, కార్యదర్శి, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ(సౌత్‌)


మార్పిడి తర్వాత జాగ్రత్తలు కీలకం

2003లో కిడ్నీ సమస్యతో మా చెల్లెలు చనిపోయింది. 2006లో నాకూ సమస్య తలెత్తింది. 2012లో మా పిన్ని నాకు కిడ్నీ దానం చేసి మరో జన్మ ప్రసాదించారు. తర్వాత నేను వివాహం చేసుకున్నా. మాకు ఒక పాప. 11 ఏళ్ల నుంచి అత్యంత జాగ్రత్తగా ఉంటున్నా.

భగవాన్‌ రెడ్డి, అధ్యక్షుడు, చేయూత ఫౌండేషన్‌ ఫర్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని