logo

కదలని యంత్రాంగం... వదలని దుమ్ము

ఇటీవల వర్షాలకు లోతట్టు రోడ్లపై నడములోతు నీరు చేరింది. ప్రధాన రహదారులపై ఇసుక, మట్టికుప్పలు పేరుకుపోయాయి. వానొచ్చి వారమైనా ఆ ఇసుక మేటలు తొలగలేదు.

Published : 28 Mar 2023 03:30 IST

వానొచ్చి వారమైనా రోడ్లపై తొలగని ఇసుక, ధూళి

రేతిబౌలి కూడలి వద్ద రహదారి అంచులో ఇసుక

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల వర్షాలకు లోతట్టు రోడ్లపై నడములోతు నీరు చేరింది. ప్రధాన రహదారులపై ఇసుక, మట్టికుప్పలు పేరుకుపోయాయి. వానొచ్చి వారమైనా ఆ ఇసుక మేటలు తొలగలేదు. మట్టి, ఇతర వ్యర్థాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. జీహెచ్‌ఎంసీ మాత్రం ఇంకా నిద్ర మత్తు వీడట్లేదు. రోడ్ల నిర్మాణం.. నిర్వహణ.. పారిశుద్ధ్య పనులకు రూ.కోట్ల ఖర్చు చేస్తున్నా, ఊడ్చే యంత్రాలతో, పారిశుద్ధ్య కార్మికులతో రోడ్లు శుభ్రం చేయించాలనే ధ్యాస అధికారుల్లో కొరవడింది.        

ఇదీ పరిస్థితి..

శివరాంపల్లి చౌరస్తా నుంచి జూ పార్కు వరకు, ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ కూడలి వరకు, బైరామల్‌గూడ చౌరస్తాలో, సుచిత్ర, బోయినపల్లి, ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు, ఎల్బీనగర్‌ కూడలి, నల్గొండ ఎక్స్‌ రోడ్డు నుంచి ఒవైసీ ఆస్పత్రి కూడలి వరకు, గోల్నాక చౌరస్తా నుంచి రామంతాపూర్‌ వరకు పైవంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనులతో ఆయా రోడ్లపై గుంతల ఏర్పడ్డాయి. వర్షంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. వర్షం వస్తే బురద, వర్షం తగ్గితే దుమ్ముతో అవస్థలు పడుతున్నామని వాహనదారులు, ఆటోడ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు 45 పైవంతెనపై ఇసుక

* ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ కూడలి వరకు, చంచల్‌గూడ జైలు నుంచి ఒవైసీ ఆస్పత్రి కూడలి వరకు ఉక్కు వంతెనలు నిర్మిస్తున్నారు. భారీ ఉక్కు స్తంభాలపై పిల్లర్లపై ఏర్పాటు చేస్తున్న క్రమంలో.. వాటి బరువును తట్టుకోలేక రోడ్డు కుంగిపోతోంది. భూగర్భ పైపులైన్లు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రస్తుతం రహదారిపై ఎక్కడచూసినా గోతులే కనిపిస్తున్నాయి

* గోల్నాక చౌరస్తా నుంచి రామంతాపూర్‌, ఉప్పల్‌ కూడలి నుంచి నారపల్లి వరకు పైవంతెనలు నిర్మిస్తున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా మూడేళ్లుగా పనులు సాగుతున్నాయి. జాప్యం, దారి పొడవునా గుంతలకు ఇటీవలి వాన తోడవడంతో.. ఆ మార్గాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

* శివరాంపల్లి చౌరస్తా నుంచి మెహిదీపట్నం, ఖాజాగూడ నుంచి నానల్‌నగర్‌ చౌరస్తా, బేగంపేట నుంచి తార్నాక వరకు ప్రధాన రహదారులు, పైవంతెనలపై ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఇసుక, మట్టితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని