పేదల భూములు పెద్దల చేతుల్లో...!
ఇప్పుడు అందరి దృష్టి 111 జీవో పరిధిలోని గ్రామాలపైనే ఉంది. తమ చేతుల్లో ఉన్న ప్రైవేటు భూముల్లో వెంచర్లు వేసి రూ.వందల కోట్లను ఆర్జించాలని కొంతమంది రాజకీయ నాయకులు, రియల్టర్లు ప్రయత్నాలు చేస్తుంటే..
111 జీవో పరిధిలోని గ్రామాల్లో అసైన్డు భూముల పరిస్థితి
కాగితాలకే పరిమితమైన పీవోటీ చట్టం
అజీజ్‌నగర్‌లో ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూములు
ఇప్పుడు అందరి దృష్టి 111 జీవో పరిధిలోని గ్రామాలపైనే ఉంది. తమ చేతుల్లో ఉన్న ప్రైవేటు భూముల్లో వెంచర్లు వేసి రూ.వందల కోట్లను ఆర్జించాలని కొంతమంది రాజకీయ నాయకులు, రియల్టర్లు ప్రయత్నాలు చేస్తుంటే.. ఏళ్ల క్రితం పేదలకిచ్చిన అసైన్డు భూములను తీసుకుని వాటిని అక్రమ పద్ధతిలో విక్రయించి సొమ్ము చేసుకోవాలని మరికొందరు చూస్తున్నారు. జంటజలాశయాల చుట్టూ ఉన్న గ్రామాల్లోని వేలాది ఎకరాల అసైన్డు భూములపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములపై తక్షణం నిర్ణయం తీసుకోకపోతే అక్రమార్కులకు అవకాశంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆ గ్రామాల్లో 9 వేల ఎకరాల అసైన్డు..
111 జీవో పరిధిలోని గ్రామాల్లో అధికారిక లెక్క ప్రకారం 9235 ఎకరాల అసైన్డు భూములున్నాయి. ఎకరా రూ.5 కోట్లు పలుకుతుందని అంచనా. 30 ఏళ్ల కిందటే వేలాది మంది రైతులకు ప్రభుత్వం భూములను పంపిణీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ భూముల్లో వ్యవసాయం తప్ప ఇతర కార్యకలాపాలు నిర్వహించడానికి వీలులేదు. కొన్నేళ్లుగా రైతుల చేతిలో ఉన్న ఈ భూములను రాజకీయ నాయకులు, రియల్టర్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధం ఎత్తివేసిన తరువాత ఈ అసైన్డు భూముల్లో వెంచర్లు వేసి అనధికారికంగా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ పేరుతో లేఅవుట్ వేసినట్లు చూపడానికి కొందరు ప్రణాళికలు వేస్తున్నారు. అసైన్డు, సీలింగ్, భూదాన్ భూములపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని అనేకమంది కోరుతున్నారు. రైతుల నుంచి చేతుల మారిన భూములను తక్షణం వెనక్కి తీసుకుంటే ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
ఫాంహౌస్‌లుగా మార్చేశారు
నగర శివారు మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు-176, 177లలో 383.05 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూములున్నాయి. 1970 దశకంలో నిరుపేద రైతులకు సర్కారు పంపిణీ చేసింది. కాలక్రమంలో కొందరు రైతులు వీటిని విక్రయించేశారు. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలోనే 152 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కొందరు స్థిరాస్తి వ్యాపారులు, బడాబాబులు ఇక్కడి రైతులను నమ్మించి విలువైన భూములు కొనుగోలు చేసి ప్రహారీలు నిర్మించి వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లుగా మార్చేశారు.
* శంషాబాద్ మండలం మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 559 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు ఏళ్ల కిందటే పంపిణీ చేశారు. ఇందులో 350 ఎకరాల అసైన్డు భూమిని కొంతమంది రాజకీయ నాయకులు, రియల్టర్లు రైతుల దగ్గర నుంచి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఈ విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు ఆ వైపు వెళ్లడం లేదు. దీనికి కారణం రాజకీయ నాయకుల ఒత్తిడి తమపై ఉండటమే. 84 గ్రామాల్లో అసైన్డు భూముల పరిస్థితి ఇలానే ఉంది.
* అవుటర్ రింగురోడ్డుకు కిలోమీటరు దూరంలోనే ఈ 152 ఎకరాల భూములున్నాయి. ఎకరం ధర రూ.8-10 కోట్లు పలుకుతోంది. ఈ భూములు కొన్న పెద్దలు ఏకంగా రిజిస్ట్రేషన్ల తంతూ పూర్తిచేశారు. రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు(పీవోటీ) చట్టాన్ని ప్రయోగించి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం కేవలం కాగితాలకే పరిమితమైంది. సర్వేనంబరు-176లో 57.33, 177లో 75.07 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2006లో ‘దిల్’ సంస్థకు సర్వేనం-176లో 126.29 ఎకరాలివ్వగా, ఇందులోనూ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. దిల్‌కు భూములను ప్రభుత్వం రద్దుచేసింది. అప్పటికే ఇందులో సుమారు 67 ఎకరాలు మాయమవ్వడం గమనార్హం. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి, తోల్కట్ట, ఎత్బార్‌పల్లి, హిమాయత్‌నగర్, చిలుకూరు, పెద్దమంగళారం, నాగిరెడ్డిగూడ, బాకారంజాగీర్, కనకమామిడి, అప్పారెడ్డిగూడ, చిన్నమంగళారం, మేడిపల్లి, ఎన్కేపల్లి గ్రామాల్లోనూ అసైన్డు భూములు అన్యాక్రాంతమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.