logo

కాంగిరేసు అభ్యర్థులు వీరే

ఆసాంతం ఆసక్తిని కలిగిస్తూ సాగిన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క తాండూరు మినహా కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ స్థానాలకు ముందునుంచి ఊహించినట్లుగానే అభ్యర్థుల ఎంపిక వెల్లడైంది.

Updated : 16 Oct 2023 05:14 IST

 

ఆసాంతం ఆసక్తిని కలిగిస్తూ సాగిన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క తాండూరు మినహా కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ స్థానాలకు ముందునుంచి ఊహించినట్లుగానే అభ్యర్థుల ఎంపిక వెల్లడైంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల రాజకీయ ప్రస్థానంపై ‘న్యూస్‌టుడే’ కథనం. - న్యూస్‌టుడే, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌.

కొండగల్‌ బరిలో రేవంత్‌రెడ్డి

ఎనుముల రేవెంత్‌రెడ్డి మొట్టమొదటిసారి 2009లో కొడంగల్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై 6975 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో తెదేపా నుంచి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి విఠల్‌రావు, తెరాస అభ్యర్తిగా గురునాథ్‌రెడ్డి నిలబడగా రేవంత్‌రెడ్డి 14614 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో టీడీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టారు. అదే హోదాలో 17 అక్టోబర్‌ 2017లో టీడీపీకి రాజీనామా చేశారు. 20 జూన్‌ 2018లో కాంగ్రెస్‌లో చేరి అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా భారాస నుంచి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో 9,319 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి  పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 7 జూన్‌ 2021లో టీపీసీసీ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం కొడంగల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. 

తాండూరు ఎవరికో..  

తాండూరు, తాండూరు గ్రామీణ: తాండూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయం తేలలేదు. అధిష్ఠానం ప్రకటించిన తొలి జాబితాలో తాండూరు అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. తీరా జాబితాలో తాండూరు అభ్యర్థిని ప్రకటించక పోవడంతో సర్వత్రా రాజకీయ చర్చకు దారి తీసింది. తాండూరు అభ్యర్థిత్వం కోసం మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.  

టీఆర్‌ఆర్‌కు వరుసగా మూడోసారి

పరిగి నియోజకవర్గం నుంచి తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్‌)కే కాంగ్రెస్‌ టికెట్‌  మూడోసారీ వరించింది. 2009లో పార్టీ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కొప్పుల  హరీశ్వర్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిరాశ చెందక పార్టీకోసమే పనిచేస్తూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం 2014 ఎన్నికల్లో మొదటిసారి టికెట్‌ ఇచ్చింది. హరీశ్వర్‌రెడ్డిపై 5000 పైచిలుకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో హరీశ్వర్‌రెడ్డి తనయుడు కొప్పుల మహేష్‌రెడ్డికి, టీఆర్‌ఆర్‌కు మధ్య జరిగిన పోటీలో 16,400 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2020లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియామకమయ్యారు. భారత్‌ జోడో యాత్ర లాజిస్టిక్‌ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2018లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, 2014లో సీఎల్పీ కార్యదర్శిగా పనిచేశారు. ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారు.

అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు

వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధిష్ఠానం ఐదోసారి రంగంలోకి దించుతోంది. వికారాబాద్‌ నియోజకవర్గానికి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకొని సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి సంజీవరావుపై 28 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2009లో మరోమారు 4,700 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి మంత్రి పదవి కోల్పోయిన శంకర్‌రావు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్‌కుమార్‌ మంత్రివర్గంలో చేరి రాష్ట్ర చేనేత, జౌళి, లఘు పరిశ్రమల శాఖామంత్రిగా కొనసాగారు. 2014లో ముచ్చటగా మూడోసారి వికారాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకొని పోటీ చేసి తెరాస అభ్యర్థి సంజీవరావు చేతిలో 10 వేల పైచిలుకు, 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి  డాక్టర్‌ ఆనంద్‌ చేతిలో 3,526 ఓట్ల మెజార్టీతో పరాజితులయ్యారు. ప్రసాద్‌కుమార్‌ ఓటమి పాలైనా పల్లె పల్లెకు ప్రసాదన్న కార్యక్రమం పేరిట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఐదోమారు బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని