logo

మే నెల రికార్డులు.. మార్చిలోనే బద్దలు

గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం నమోదైంది. ఎండల కారణంగా గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ ఏడాది మార్చిలోనే బద్దలు కొట్టింది.

Updated : 30 Mar 2024 05:50 IST

ఎండలతో గరిష్ఠంగా పెరిగిన విద్యుత్తు వినియోగం
79.48 ఎం.యూ.తో గ్రేటర్‌లో ఆల్‌టైమ్‌ నమోదు
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం నమోదైంది. ఎండల కారణంగా గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ ఏడాది మార్చిలోనే బద్దలు కొట్టింది. 2023లో మే 19న 79.33 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఈ నెల 28న 79.48 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పాత రికార్డులు చెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయంలో 67.97 మిలియన్‌ యూనిట్లే ఉంది. ఈ ఏడాది మార్చి నెల ఆరంభం నుంచి గ్రేటర్‌లో వినియోగం గణనీయంగా పెరిగింది.

23 శాతం దాకా పెరుగుదల : గతేడాది మార్చి నెల సరాసరి విద్యుత్తు వినియోగం 57.84 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఏకంగా   70.96 మి.యూ.కు పెరిగింది. దాదాపు 22.7 శాతం పెరుగుదల నమోదైంది.

రాబోయే నెలల్లో 90 మి.యూ.: ఈ వేసవిలో విద్యుత్తు వినియోగం అధికారుల అంచనాకు మించి నమోదవుతుంది. మే నెలలో గరిష్ఠం 83 నుంచి 85 మిలియన్‌ యూనిట్ల వరకు ఉండొచ్చని మొదట్లో అంచనా వేశారు. ఇప్పుడు వాడుతున్న తీరును బట్టి చూస్తే 90 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగినా తట్టుకునేందుకు అదనపు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతరత్ర ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

నిరంతర పర్యవేక్షణ..  : సరఫరా తీరుపై ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు సీజీఎంలు, ఎస్‌ఈలతో సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. విద్యుత్తు డిమాండ్‌-సరఫరా, అంతరాయాలపై, సిబ్బంది హాజరు వంటి నివేదికలను పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. వారానికి ఒకసారి సీజీఎం, ఎస్‌ఈలు విధిగా బస్తీల్లో, కాలనీల్లో పర్యటించాలని సీఎండీ ఆదేశించారు. పీక్‌ అవర్స్‌ ముగిసే వరకు నిత్యం రాత్రి 9 గంటల వరకు విధుల్లో అన్ని విభాగాల అధికారులు ఉండాల్సిందిగా ఆదేశించారు. 212 సెక్షన్లలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్లలో 800 మంది సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని