logo

అమెరికా ఆర్మీ అధికారినంటూ రూ.23 లక్షలు స్వాహా

అమెరికా ఆర్మీలో మహిళా అధికారినంటూ నమ్మించి 80 ఏళ్ల విశ్రాంత శాస్త్రవేత్తనుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.23.59 లక్షలు కాజేశారు. తనవద్ద ఉన్న డాలర్లను భద్రపరిస్తే కమీషన్‌ ఇస్తానని చెప్పిన ఆమె..

Published : 16 Apr 2024 05:54 IST

ఈనాడు- హైదరాబాద్‌: అమెరికా ఆర్మీలో మహిళా అధికారినంటూ నమ్మించి 80 ఏళ్ల విశ్రాంత శాస్త్రవేత్తనుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.23.59 లక్షలు కాజేశారు. తనవద్ద ఉన్న డాలర్లను భద్రపరిస్తే కమీషన్‌ ఇస్తానని చెప్పిన ఆమె.. తర్వాత దిల్లీ కస్టమ్స్‌ విభాగంలో సుంకం చెల్లించాలంటూ ఆయన నుంచి సొమ్ము కొట్టేశారు. సోమవారం బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్తకు ఇటీవల వాట్సాప్‌కాల్‌ వచ్చింది. తనపేరు మిక్‌ బ్రౌన్‌ అని, అమెరికా ఆర్మీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. ఐరాస శాంతిదళం మిషన్‌లో భాగంగా సిరియాలో పనిచేస్తున్నానని, ఇటీవల కొందరు విప్లవకారులు భారీగా అమెరికా డాలర్లు పోగొట్టుకున్నారని, అవి తనకు దొరికాయని చెప్పింది. ఈ డబ్బును భద్రపరిస్తే మూడో వంతు కమీషన్‌ లెక్కన ఇస్తానని చెప్పింది. శాస్త్రవేత్త అంగీకరించారు. రెండ్రోజుల తర్వాత ఆయనకి మరో ఫోన్‌ వచ్చింది. తాను దిల్లీ కస్టమ్స్‌ అధికారుల వద్ద ఉన్నానని, డబ్బు విడుదలకావాలంటే కస్టమ్స్‌ సుంకం రూ.23.59 లక్షలు కట్టాలంది. నమ్మిన శాస్త్రవేత్త ఆమె చెప్పిన ఖాతాకు నగదు బదిలీచేశారు. తర్వాత ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని