logo

అతివేగానికి మూడు ప్రాణాలు బలి

వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్‌ ఠాణా సీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 Apr 2024 03:37 IST

మునావర్‌

పటాన్‌చెరు, కేశవగిరి, న్యూస్‌టుడే: వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్‌ ఠాణా సీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్‌కు చెందిన ఎండీ మునావర్‌(35), అనీష్‌ ఫాతిమాబేగం(38), సర్వర్‌ ఖురేషి, జాఫర్‌, షఫీ, గులాబ్షాలు గుల్బర్గా దర్గాకు ఇన్నోవాలో వెళ్లారు. గురువారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద అవుటర్‌పై ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో వీరి కారు అతివేగంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న మునావర్‌, పక్కసీట్లో కూర్చున్న అనీష్‌ ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెనుక కూర్చున్న నలుగురు గాయపడ్డారు.

ఇంటికి పెద్దదిక్కు: మునావర్‌ కారు అద్దెకివ్వడంతో పాటు డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. ఇంటికి పెద్దవాడైన మునావర్‌కు రెండేళ్లక్రితం పెళ్లి కాగా.. ఏడాదిన్నర కుమార్తె ఉంది. తండ్రి, సోదరుడు, భార్య, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. సమీపంలో ఉంటున్న ఖురేషి కుటుంబం కారు కిరాయికి మాట్లాడుకుని గుల్బర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. మునావర్‌ మృతితో అతని కుటుంబం, బస్తీలో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. 

కొడుకు కోసం అంత్యక్రియలు ఆలస్యం: ప్రమాదంలో మృతిచెందిన ఫాతిమా బేగంకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు. భర్త ఖురేషీ తీవ్రంగా విలపిస్తున్నాడు. కొడుకు ఉస్మాన్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగంచేస్తున్నాడు. అతడు శనివారం వచ్చాక అంత్యక్రియలు చేయనున్నారు.

కారు ఢీకొని కానిస్టేబుల్‌..

పోచారం(ఘట్‌కేసర్‌): పోచారం ఐటీకారిడార్‌ సీఐ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ బీరప్పగడ్డలో నివాసముంటున్న పర్వతం ధనుంజయ(41) సరూర్‌నగర్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఘట్క్‌ేసర్‌ మండలం బొక్కానిగూడలో ఉంటున్న సోదరి మమత కొడుకు పుట్టిన రోజు వేడుకలకు భార్య సరిత, కొడుకులు హన్సిత్‌(9) జయాన్ష్‌(6)లతో గురువారం రాత్రి బైక్‌పై వెళ్లారు. వేడుకలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అన్నోజిగూడ వద్దకు రాగానే ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపు అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. కిందపడి పోవడంతో ధనుంజయ తలకు తీవ్రగాయమయ్యింది. భార్య, పిల్లలకు గాయాలు కావడంతో స్థానికులు 108లో ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ధనుంజయ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన అన్నోజిగూడలోని ఆర్‌జీకేకాలనీవాసి, డ్రైవర్‌ కొమ్ముల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని