logo

ఆసుపత్రుల్లో వసతులు భేష్‌

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేటుకు దీటుగా వసతులు కల్పిస్తూ నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోంది.

Updated : 10 Jun 2023 05:44 IST

జిల్లాలో నాలుగు ఆసుపత్రులకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు

ఆత్మకూర్‌ పల్లె దవాఖానా

జగిత్యాల, రాయికల్‌, మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేటుకు దీటుగా వసతులు కల్పిస్తూ నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోంది. పల్లె దవాఖానాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ సదుపాయాలు ఉండడంతో కేంద్ర బృందాలు పర్యటించి సేవలను పరిశీలించి ప్రశంసిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఎన్‌క్వాస్‌ జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి.

గుర్తింపు పొందాయి ఇలా..

జిల్లాలో మల్లాపూర్‌, మేడిపల్లి, జగిత్యాల పట్టణంలోని మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ధర్మపురి, తదితర ఆసుపత్రులు ఇప్పటికే ఎన్‌క్వాస్‌ గుర్తింపు పొందగా తాజాగా గత ఏప్రిల్‌, మే మాసాల్లో జిల్లాలోని కథలాపూర్‌, కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రులను జాతీయ బృందాలు క్షేత్ర స్థాయిలో పలు విభాగాల్లో అందిస్తున్న సేవలు, రికార్డులు పరిశీలించారు. జాతీయ స్థాయి ప్రమాణాల నివేదికలను కేంద్రానికి పంపించారు. దీంతో ఈనెల 4న కేంద్ర ఆరోగ్యశాఖ జాతీయ స్థాయి క్వాలిటీ ఆస్యూరెన్స్‌(ఎన్‌క్వాస్‌) గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం ప్రాంతీయ ఆసుపత్రులకు ఏటా రూ.10 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.1.75 లక్షల చొప్పున మూడేళ్ల పాటు అందిస్తారు. మూడేళ్ల తర్వాత మళ్లీ కేంద్ర బృందాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి.  

అధికారుల ప్రత్యేక చొరవ

ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, వసతులు కల్పించడానికి జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆసుపత్రులలో జాతీయస్థాయిలో నిర్వహించే 14 కార్యక్రమాల అమలు తీరును జిల్లా ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షకులు నిరంతరం ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని అమలు చేస్తుండడంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమవుతోంది. మూడేళ్ల పాటు మంజూరు చేసే ఈ నిధుల నుంచి 75 శాతం ఆసుపత్రి అభివృద్ధికి 25 శాతం సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించనున్నారు.

మెరుగైన సేవలు అందిస్తాం

జిల్లాలోని ఆసుపత్రులకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటాం. జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపడుతున్నాం. వైద్య సేవల్లో జగిత్యాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువస్తాం. అందరి సహకారంతోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైంది.

డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌, డీఎంహెచ్‌వో

కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు