logo

రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్‌

తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్‌తో  రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు.

Published : 29 Mar 2024 04:47 IST

వేములవాడ, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్‌తో  రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓవైపు తన సోదరి లిక్కర్‌ స్కాంలో జైల్లో ఉందని, ఫోర్జరీ, ఛీటింగ్‌ కేసులో సంతోష్‌రావు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌రావు, కేటీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై రోజుకో కథనం వినిపిస్తుండటంతో మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్పా మరేదీ కాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరవు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుందని, వేసవిలో కాంగ్రెస్‌తోనే కరవు వచ్చిందని అనడం చూస్తుంటే వారు కృత్రిమ కరవును కోరుకుంటున్నట్లుందని ఎద్దేవా చేశారు. భారాస పాలనలో కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని, రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మీ కుటుంబ సభ్యులు అవినీతి, అక్రమాల కేసుల్లో పీకల్లోతుల్లో కూరుకుపోయారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కల్వకుంట్ల కుటుంబం బందీ అయిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి చుట్టూ సుమారు రెండు కిలో మీటర్ల పరిధిలో ఎవరేమి మాట్లాడారో విన్న మీరు నైతికథ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎక్కడ అరెస్టు అవుతారోనని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు కరవును భారాసనే సృష్టిస్తోందని, రూ.లక్ష కోట్ల ప్రజా ధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అది కుంగిపోగానే పది టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై భారాస నాయకులు చేస్తున్న ఆరోపణలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని