logo

నిర్వహణ భారం.. కమీషన్‌లో కోత

కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్‌లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

Published : 24 Apr 2024 05:40 IST

అవస్థల మధ్య ధాన్యం సేకరణ
న్యూస్‌టుడే, సారంగాపూర్‌

ధాన్యం సేకరణలో నిర్వాహకులు

 కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్‌లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పదేశ్లుగా అందించే కమీషన్‌ ఇప్పటికీ అదే కొనసాగిస్తుండడం, ప్రతి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ వ్యయం పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కమీషన్‌ సకాలంలో విడుదల కాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. గత రెండు సీజన్‌ల కమీషన్‌ ఇటీవల విడుదల చేసినప్పటికీ మంజూరైన వాటిలో కేవలం 70శాతం మాత్రమే సహకార, సెర్ప్‌కు జమ చేయడంతో నష్టాలు రానున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం సంఘాలపై పడుతోంది.

జిల్లా వ్యాప్తంగా గత యాసంగిలో(2022-23) 144 కొనుగోలు కేంద్రాల ద్వారా 12,56,923 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించగా కమీషన్‌ రూ.4.04 కోట్లు రావాల్సి ఉండగా రూ.2.80 కోట్లు, ఖరీఫ్‌(2022-23)లో 133 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,61,872 క్వింటాళ్ల ధాన్యానికి రూ.3.66 కోట్లకు గానూ రూ.2.56కోట్లు మాత్రమే సెర్ప్‌కు జమ చేస్తున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 275 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 26,18,566 క్వింటాళ్లు, యాసంగిలో 270 కొనుగోలు కేంద్రాల ద్వారా 29,49,347 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. రెండు పంటలకు గాను సెర్ప్‌, సహకార సంఘాలకు దాదాపు రూ.25.57 కోట్ల కమీషన్‌ రావాల్సి ఉంది. ఇందులో కేవలం 70 శాతం ఆయా సంఘాలకు జమ చేస్తున్నారు. అలాగే 2023-24 ఖరీఫ్‌లో సహకార, సెర్ప్‌ ద్వారా 3,73,575 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించగా దీనికి సంబంధించి దాదాపు రూ.8 కోట్ల మేర కమీషన్‌ విడుదల కావాల్సి ఉంది.

ఆరకొర కమీషన్‌తో నెట్టుకొస్తున్న సంఘాలకు గన్నీ సంచుల భారం మీద పడుతోంది. కేంద్రానికి అందించిన గన్ని సంచులు తిరిగి పూర్తిగా అందించాల్సి ఉంటుంది. అయితే మిల్లర్ల ద్వారా అందించే పాత గన్నీ సంచులు పూర్తిగా చెడిపోయినవి రావడమే కాకుండా సంచులు తక్కువగా ఉండడంతో సంఘాలు భరించాల్సిన పరిస్థితి. ఒక్క సారంగాపూర్‌ సహకార సంఘం పరిధిలో 60వేల సంచుల భారం పడగా జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉంటుంది. అదే విధంగా సేకరించే ధాన్యానికి క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్‌ చెల్లిస్తున్నారు. అయితే ఇందులో రూ.13 మాత్రమే నిర్వహణకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇందులో 5వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తే రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు వ్యయం చేస్తుంటే కేవలం రూ.60వేలు మాత్రమే చెల్లించేందుకు అనుమతి ఉంది. ఇందులో మహిళల రోజువారీ కూలీ కనీసం రూ.33 వేలు, ట్యాబ్‌, రికార్డుల అపరేటర్ల వేతనాల కోసం రూ.25వేలు, వాచ్‌మెన్‌ కోసం రూ.8వేలు, అంతేకాకుండా సుతిలీ, ఇతరత్రా రూ.15 నుంచి రూ.20వేల వరకు అదనంగా ఉంటున్నాయి. తక్కువ మొత్తంలోనే వ్యయం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో నిర్వహణ ఖర్చు సరిపోవడం లేదు. దీనికి తోడు వచ్చిన కమీషన్‌లో 30 శాతం కోత విధించడంతో నిర్వహణ భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సంఘాల్లో జమవుతున్నాయి

- మల్లేశం, డీపీఎం

రెండు పంటలకు సంబంధించిన కమీషన్‌ ఇటీవల విడుదల కావడంతో ఆయా సంఘాలలో జమ చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఆయా సంఘాలకు 70 శాతం మేర జమవుతున్నాయి. ఖరీఫ్‌ పంట కమీషన్‌ రావాల్సి ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని