logo

సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి

సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు.

Published : 18 Apr 2024 02:54 IST

బనగానపల్లి, న్యూస్‌టుడే: సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిదేళ్లలో అరాచకపాలన తప్ప చేసేందేమి లేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని కట్టించినా పూర్తిస్థాయిలో పరికరాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలపాలవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,035 మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. వంగల పరమేశ్వరరెడ్డి, కె.మల్లికార్జునరెడ్డి, టంగుటూరి శీనయ్య, బొబ్బల గోపాల్‌రెడ్డి, బురానుద్దీన్‌, అల్తాఫ్‌, ఖాదర్‌, దస్తగిరి, రాయలసీమ సలాం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులోని వెంగళరెడ్డి కాలనీ, 3వ వార్డులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు అన్ని ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇంట్లో చదువుకునే వారందరికి అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్‌ ఇంట్లో ఒక్కరికే పరిమితం చేశారన్నారు. పింఛన్‌ల కోత విధించారన్నారు. తెదేపా పాలనలో మైనార్టీలకు అభివృద్ధి జరిగితే ప్రస్తుత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వివరించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తలేదన్నారు. పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో యువకులు దానికి బానిసలయ్యారని దీనికి కారణం వైకాపానే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిస్తే పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతామన్నారు. చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీపైనే చేస్తారని వివరించారు. నాయకులు కలీముల్లా, వేణుగోపాల్‌, శివప్రసాదరెడ్డి, నాగూర్‌ఖాన్‌, పస్పిల్‌ మున్నా, రాజారెడ్డి పాల్గొన్నారు.


పార్టీ గెలుపునకు కృషి చేయాలి: కోట్ల

బోయవాండ్లపల్లె(ప్యాపిలి), న్యూస్‌టుడే: డోన్‌ నియోజకవర్గంలో తెదేపా విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డోన్‌ నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘బాబు స్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారంటీ’ని మండలంలోని రాచవాండ్లపల్లె, బోయవాండ్లపల్లె, డి.రంగాపురం, జక్కసానికుంట్ల గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలోనే బీసీలకు రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించినట్లు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్‌, టి.శ్రీనివాసులు, పుల్లారెడ్డి పాల్గొన్నారు.


జక్కసానికుంట్ల (ప్యాపిలి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి, డోన్‌ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. జక్కసానికుంట్లలో ‘బాబు స్యూరిటీ...భవిష్యత్తుకు గ్యారంటీ’ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు రామరాజ్యం తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక రాక్షసరాజ్యం తెచ్చారని తెలిపారు. ఒక్కసారి ఛాన్స్‌ అడిగితే ప్రజలు నమ్మి జగన్‌ను గెలిపించారని, అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వై.నాగేశ్వరరావుయాదవ్‌, ధర్మవరం సుబ్బారెడ్డి, జయరాముడు, దేవేంద్ర, ఆదిరెడ్డి, గంగిరెడ్డి, మహేశ్‌ పాల్గొన్నారు.


ఎమ్మెల్యేనైతే గేటు వసూళ్లుండవ్‌

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆళ్లగడ్డలో గేటు వసూలు లేకుండా చేస్తానని ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పురపాలక పరిధిలో ఆర్యవైశ్యులు, వ్యాపారులతో తాను సమావేశమైనప్పుడు గేటు వసూలు అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని, అందుకే అవి లేకుండా చేస్తానని, అవసరమైతే ఆ మొత్తాన్ని తానే చెల్లించేందుకు ముందుకు వస్తానన్నారు. లారీ డ్రైవర్లతో సమావేశమయ్యానని, గ్రీన్‌ ట్యాక్స్‌, ఎఫ్‌సీ, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ రుసుములు, లోడ్‌ జరిమానాలు విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోపే ఆళ్లగడ్డ, శిరివెళ్లలో ఆటోనగర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఆటోడ్రైవర్ల కోసం మూడుచోట్ల ఆటోస్టాండ్లు ఏర్పాటు చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని