logo

చిత్రసీమలో నడిగడ్డ బిడ్డలు

కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన సురేశ్‌ (సూరి) యంఏ బీఎడ్‌ వరకు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ మ్యానరిజం అంటే చాలా ఇష్టం.

Published : 23 May 2023 05:16 IST

రెయిన్‌ స్టార్‌ బిరుదు సాధించాలని ఉంది

గబ్బర్‌సింగ్‌ కవర్‌సాంగ్‌  చిత్రీకరణలో సురేశ్‌

గద్వాల గ్రామీణం, న్యూస్‌టుడే : సినిమాల్లో నటించడమంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అందులో నిలదొక్కుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నటనాపరంగా నవరసాలు పండించగలిగితేనే వెండితెరపై రాణించగలుగుతారు. తెలుగు చిత్రసీమలో నడిగడ్డ నుంచి ఆంజనేయ ప్రసాద్‌ (అంజి దేవేండ్ల), అంజి వల్గుమాన్‌ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరితో పాటు యూట్యూబ్‌ స్టార్‌ కుచినెర్ల సురేశ్‌ రెయిన్‌ కవర్‌సాంగ్స్‌ చేస్తూ ఆదరణ పొందుతున్నారు. వీరి గురించి ‘న్యూస్‌టుడే’ కథనం.

కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన సురేశ్‌ (సూరి) యంఏ బీఎడ్‌ వరకు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ మ్యానరిజం అంటే చాలా ఇష్టం. 2021లో గ్యాంగ్‌లీడర్‌ సినిమాలోని సండే అననురా మండే అననురా..కవర్‌ సాంగ్‌ను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నుంచి విడుదల చేయించారు. భీమ్లానాయక్‌, టైటిల్‌సాంగ్‌తో సమాజానికి సందేశమిస్తూ చేసిన కవర్‌సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఘరానా మొగుడు చిత్రంలోని ‘కిటుకులు తెలిసిన’, మెకానిక్‌ అల్లుడు చిత్రంలోని ‘గురువా గురువా..’ వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రెయిన్‌ సాంగ్స్‌ మాషప్‌ కూడా చేశారు. అచ్చంగా వెండితెర సినిమా సాంగ్స్‌కి ఏమాత్రం తగ్గకుండా కవర్‌సాంగ్స్‌తో ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. రెయిన్‌ స్టార్‌ బిరుదు సాధించాలని ఉందని సురేశ్‌ తెలిపారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు

జమ్మిచేడు గ్రామానికి చెందిన అంజి వల్గుమాన్‌ డిగ్రీ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తితో 2006లో హైదరాబాద్‌కు వెళ్లిన అంజి అప్పటి నుంచి సినిమాల్లో నటించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. 2006లో థియేటర్‌ ఆర్ట్స్‌ (రంగస్థల కళలు)లో ప్రవేశం పొంది ఇప్పటివరకు 300కు పైగా నాటకాల్లో నటించారు.

స్వయంగా రాసి దర్శకత్వం వహించిన వినాశి, బ్లాక్‌ అండ్‌ వైట్‌ వంటి రెండు నాటకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించారు. 2009లో ‘ఈటీవీలో కామెడీ గ్యాంగ్‌’ షోలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బెస్ట్‌ విన్నర్‌ అయ్యారు. అనంతరం కొన్ని ధారావాహికల్లో నటించిన అంజి 2013లో ఈటీవీ జబర్దస్త్‌లో చమ్మక్‌ చంద్ర, పటాస్‌ ప్రకాశ్‌ టీమ్‌లలో సుమారు 80కి పైగా ఎపిసోడ్‌లో కామెడీ స్కిట్‌లు చేశారు. మహాత్మ, సారాయి వీర్రాజు, పైసా, ఏబీసీడీ, లవర్‌, బిలాల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌, స్కైలాబ్‌, సురాపానం, బలగం సినిమాల్లో నటించారు. ఓటీటీ వచ్చేసరికి మెయిల్‌, కొత్తపోరడు వంటివి చేశారు. ఇంటింటి రామాయణం, పరేషాన్‌, భీమ దేవరపల్లి బ్రాంచి, రామన్న యూత్‌ వంటి సినిమాలు చిత్రీకరణ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దగ్గుపాటి రానా సమర్పణలో పరేషాన్‌, సీనియర్‌ యాక్టర్‌ నరేశ్‌కు తమ్ముడిగా నటించిన ఇంటింటి రామాయణం చిత్రాలు జూన్‌ 2న విడుదల కానున్నాయి. నటనాపరంగా కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న అంజి తనకంటూ ఒక మంచి పేరు మోసిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాలని లక్ష్యం పెట్టుకున్నారు.

దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి..

గద్వాల పాతహౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఆంజనేయ ప్రసాద్‌ (అంజి దేవేండ్ల)కు మొదటగా స్రవంతి ధారావాహికలో అవకాశం వచ్చింది. అందులో 70 ఎపిసోడ్లలో నారిగాడు పాత్రలో నటించారు. బంధం, వైశాలి, శుభలేఖ, ఆడపిల్ల, శ్రీ శ్రీమతి కల్యాణం, మంచుపల్లకి ధారావాహికల్లో ప్రధాన ప్రాత పోషించారు. అదే సమయంలో సినిమాల అవకాశాలు వచ్చాయి. డాన్‌ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కేడీ, ఢమరుకం, రాజన్న, రాఖీ, ఊసరవెల్లి, రభస, హ్యాపీ, రేసుగుర్రం, అన్నవరం, ఖతర్నాక్‌, మహాత్మ, అల్లరి పిడుగు, శౌర్యం, శంఖం, ఒంటరి, దొంగలబండి, సుడిగాడు, నువ్విలా, సారాయి వీర్రాజు ఇలా ఇప్పటివరకు 60 సినిమాల్లో నటించారు. వెండితెరపై దర్శకుడిగా చిత్రసీమలో మంచిపేరు, గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యం దిశగా కృషి చేస్తున్నారు.

దర్శకత్వం వహిస్తున్న ఆంజనేయ ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని