logo

అబ్రహం చేరికతో తొలగిన ఉత్కంఠ!

అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌ గూటికి చేరడంతో నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఏ మేరకు చూపుతుందోనన్న చర్చ స్థానికంగా ఊపందుకుంది. 2018లో భారాసలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌పై విజయం సాధించారు.

Updated : 25 Nov 2023 05:42 IST
ఈనాడు, మహబూబ్‌నగర్‌: అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌ గూటికి చేరడంతో నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఏ మేరకు చూపుతుందోనన్న చర్చ స్థానికంగా ఊపందుకుంది. 2018లో భారాసలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌పై విజయం సాధించారు. 2009లో ఆయన కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెదేపా నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 20 ఏళ్లుగా అబ్రహంకు అలంపూర్‌ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. అలంపూర్‌ నుంచి భారాస తరపున అబ్రహంకు టికెట్‌ కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌ మొదట ప్రకటించారు. పాలమూరులో అబ్రహం మినహా మిగిలిన అభ్యర్థులందరికీ బీ-ఫాంలు ఇవ్వడంతో భారాస అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి తన అనుచరుడు విజయుడికి టికెట్‌ కోసం ప్రయత్నాల్లో భాగంగా అబ్రహంకు బీ-ఫాం ఇవ్వలేదు. చివరి వరకు ఇస్తారని ఆశించిన అబ్రహంకు మొండిచెయ్యి ఎదురైంది. నామినేషన్ల చివరి తేదీ వరకు నియోజకవర్గంలో భారాస తరపున ఆయన ప్రచారం కూడా  చేసుకున్నారు. 9న విజయుడికి భారాస బీ-ఫాంను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అందించారు. దీంతో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వెల్లడించారు. స్వతంత్రంగాగానీ, ఇతర పార్టీ నుంచిగానీ టికెట్‌ తెచ్చుకుని బరిలో ఉంటారని భావించినా పోటీకి దూరంగానే ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో అబ్రహం శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని