logo

అవకాశాలు అపారం.. నైపుణ్యాలే సోపానం

విద్యార్హత ధ్రువపత్రాలు మాత్రమే ఉంటే ఉద్యోగాలు రావు. ఇందుకు తగిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు అవసరం. ఇవి లేకపోవటం వల్లనే చాలామంది అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు.

Published : 17 Apr 2024 05:53 IST

పాలమూరు విద్యావిద్యాలయంలో యూత్‌ ఓరియంటేషన్‌ కోర్సుకు శ్రీకారం
న్యూస్‌టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం

ఒప్పంద పత్రం చూపుతున్న పీయూ ఉప కులపతి ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రిజిస్ట్రార్‌, ఆయిస్టర్‌ సంస్థ ప్రతినిధులు

విద్యార్హత ధ్రువపత్రాలు మాత్రమే ఉంటే ఉద్యోగాలు రావు. ఇందుకు తగిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు అవసరం. ఇవి లేకపోవటం వల్లనే చాలామంది అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) కార్యాచరణ చేపట్టింది. ఇందుకు ఆయిస్టర్‌ అనే స్వచ్ఛంద సంస్థతో మూడేళ్ల ఒప్పందం చేసుకుంది. సంస్థ ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తుంది. ఇందులో అవగాహన కల్పించే అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

చదువుతో పాటు విద్యార్థులకు సామాజిక అవగాహన చాలా ముఖ్యమని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా అనేక నైపుణ్యాలు పొందొచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) పూర్వ విద్యార్థులు పలువురు ఆయిస్టర్‌ అనే సంస్థను నెలకొల్పారు. సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల వేదికగా ‘యూత్‌ కమ్యూనిటీ ఓరియంటేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సు’కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఇతర విద్యాసంస్థలకు విస్తరించారు. ఈసారి పీయూతో ఒప్పందం చేసుకున్నారు. కోర్సులో భాగంగా సుస్థిర అభివృద్ధి, అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర, ప్రజా ఉద్యమాలు, కృత్రిమ మేధ, సాంకేతిక నైపుణ్యాలు, సైబర్‌ సెక్యూరిటీ, విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, సమాచార ప్రసార సాధనాలు, పరిశోధనా పద్ధతులు, పౌర హక్కులు, వినియోగదారుల హక్కులు, మహిళలు, బాలల హక్కులు, మహిళా సాధికారత, సామాజిక మార్పులో యువత, పౌరుల పాత్ర, విద్య ప్రాధాన్యం, ఆరోగ్యం, పర్యావరణ సమస్యలు - పరిష్కార మార్గాలు, ఇంకుడు గుంతలు - జల సంరక్షణ, ఓటరు చైతన్యం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సేంద్రియ వ్యవసాయం ఇలా అనేక అంశాలపై నిపుణులతో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, వ్యవసాయం, పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి తదితర శాఖల సహకారం తీసుకుంటారు. ఈ కోర్సు కాల పరిమితి మూడు నెలలు. ఇందులో భాగంగా ఇంటర్న్‌షిప్‌, క్షేత్ర సందర్శన కార్యక్రమాలు కూడా ఉంటాయి. 18 ఏళ్ల వయస్సు ఉన్న యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ కోర్సుకు అర్హులే. కోర్సులో చేరిన  విద్యార్థుల్లో ప్రతిభ కనబరచిన వారికి రూ.4వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. ఈ కోర్సు సర్టిఫికెట్‌తో స్త్రీ, శిశు సంక్షేమం, సేవారంగాల్లో ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుంది.


ప్రణాళికలు రూపొందించాం
- ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, పీయూ ఉప కులపతి

యువత చదువుతో పాటు సామాజిక అంశాలపై కూడా దృష్టిసారించాలి. ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవొచ్చు. ఈ దిశగా పీయూ విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఆయిస్టర్‌ సంస్థతో కలిసి ప్రణాళికలు రూపొందించాం.


విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం..
- సునీల్‌ సింగాడే, ఆయిస్టర్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు

పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ఆయిస్టర్‌ ముందుకు సాగుతుంది. పీయూతో మూడేళ్ల ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. వెనకబడిన ప్రాంతం పాలమూరు యువత అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా కృషిచేస్తాం. కమ్యూనికేషన్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌తో పాటు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని